
నిలకడగా గోదారి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ఉధృతి నిలకడగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6.15 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.70 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం రాత్రి 7 గంటల వరకూ అదే స్థాయిలో నీటి ఉధృతి కొనసాగింది. బ్యారేజీ నుంచి 9,77,625 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువన పెరుగుతున్న నీటిమట్టాలతో ధవళేశ్వరం వద్ద మంగళవారం నీటి ఉధృతి తిరిగి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తూండటంతో గోదావరి ఉధృతి మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది.
ఎగువన గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో)
కాళేశ్వరం 13.21
పేరూరు 17.15
దుమ్ముగూడెం 12.38
భద్రాచలంలో 45.70 (అడుగులు)
కూనవరం 18.50
కుంట 9.61
పోలవరం 11.85
రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.08
వరదలపై సమన్వయంతో చర్యలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గోదావరి వరదల నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ ఆదేశించారు. వరద పరిస్థితులపై పలు శాఖల అధికారులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. వరద బాధితులను రెవెన్యూ యంత్రాంగం సురక్షిత ప్రదేశాలకు తరలించి, సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలీసు, రెవెన్యూ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులతో ఘాట్ల వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం అందించేందుకు కంట్రోలు రూములు ఏర్పాటు చేశామని మేఘస్వరూప్ తెలిపారు.
కంట్రోల్ రూము నంబర్లు
కలెక్టరేట్, బొమ్మూరు–89779 35611
రాజమహేంద్రవరం ఆర్‌డీఓ కార్యాలయం
0883–2442344
కొవ్వూరు ఆర్‌డీఓ కార్యాలయం
79953 67797
టోల్ ఫ్రీ నంబర్లు
1070, 112, 1800 – 425–0101, 83339 05022