
రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో ‘తూర్పు’ విజయం
● జట్టు క్రీడాకారులంతా
దేవరపల్లి విద్యార్థులే
● ఐదు బంగారు పతకాలు కై వసం
దేవరపల్లి: ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో జిల్లా జట్టు విజయకేతనం ఎగురవేసి, ప్రథమ స్థానం సాధించింది. ఈ జట్టులోని క్రీడాకారులంతా దేవరపల్లికి చెందిన విద్యార్థులే కావడం ఒక విశేషం కాగా, ఐదు బంగారు పతకాలు సాధించడం మరో విశేషం. శాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ ఈ వివరాలు తెలిపారు. క్రీడాకారులు లక్కా గణపతి, చింతపల్లి సతీష్, పాటంశెట్టి సాయి, కుక్కల పవన్‌కుమార్, తంగెళ్ల వంశీ బంగారు జిల్లా జట్టులో ఆడి బంగారు పతకాలు, కప్ సాధించారని వివరించారు. 2017లో జరిగిన అండర్–19 స్కూల్ గేమ్స్ సెపక్‌తక్రా పోటీల్లో కూడా వీరు ప్రథమ స్థానం సాధించి, బంగారు పతకాలు కై వసం చేసుకున్నారని తెలిపారు. క్రీడాకారులను రవీంద్రనాథ్, పంచాయతీ కార్యదర్శి నిట్టా రవికిషోర్, ఫిజికల్ డైరెక్టర్ తలారి సరస్వతి తదితరులు అభినందించారు.
వైభవంగా సత్యదేవుని ప్రాకార సేవ
తొండంగి: రత్నగిరిపై సత్యదేవుని ప్రాకార సేవ ఆదివారం వైభవంగా జరిగింది. ప్రధానాలయంలో మూలవిరాట్టుకు వేదమంత్రోచ్చారణతో అర్చకులు అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీపై రాజగోపురం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ గావించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మహాశక్తి యాగ ప్రాంగణంలో
64 అడుగుల అమ్మవారి విగ్రహం
కాకినాడ రూరల్: మహాశక్తి యాగ ప్రాంగణంలో 64 అడుగుల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు. పీఠంలో మహాశక్తి యాగం వంద కోట్ల కుంకుమార్చనలు ఆదివారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం వారాహి, కీలక స్తోత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చనల్లో వేలాదిగా పాల్గొన్న మహిళలనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, కోట్ల కుంకుమార్చనలు అందుకున్న అమ్మవారు మహాశక్తిగా అందరినీ కాపాడేందుకు మహాశక్తి దీపం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మహాశక్తి దీపంలో 108 అడుగుల ఎత్తున ఒక మహాపర్వతం, దానిని ఆనుకుని 64 అడుగుల ఎత్తున అమ్మవారు ఉంటారని వివరించారు. అమ్మవారి చుట్టూ చండీ, భైరవి, మాతంగి, వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర తదితర 8 శక్తులు ఉంటాయన్నారు. దేశంలోని వన మూలికల వృక్షాలను అమ్మవారి చుట్టూ పెంచుతామన్నారు. అందరూ కూర్చుని హాయిగా పారాయణ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. లలితా సహస్ర నామ పారాయణతో 72 వేల నాడులు యాక్టివేట్ అవుతాయని స్వామీజీ చెప్పారు. ప్రతి ఒక్కరూ లలితా పారాయణ చేసుకోవాలని సూచించారు. మహాశక్తి యాగంలో మొదటి, రెండో సంవత్సరం పాల్గొన్న భక్తురాలికి వివాహమైన 14 ఏళ్లకు ముగ్గురు కుమార్తెలు శశిరేఖ, శశిప్రియ, శశికళ జన్మించారని, ఇది యాగ ఫలితమని పేర్కొంటూ వారిని ఒడిలోకి తీసుకుని ముచ్చటించి, భక్తులకు చూపించారు.

రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో ‘తూర్పు’ విజయం

రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో ‘తూర్పు’ విజయం