స్టెతస్కోప్‌ వీడి.. సమ్మెబాటలో.. | - | Sakshi
Sakshi News home page

స్టెతస్కోప్‌ వీడి.. సమ్మెబాటలో..

Sep 28 2025 7:22 AM | Updated on Sep 28 2025 7:22 AM

స్టెత

స్టెతస్కోప్‌ వీడి.. సమ్మెబాటలో..

సాక్షి, రాజమహేంద్రవరం: ఏరు దాటేవరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా మారింది చంద్రబాబు, కూటమి నేతల తీరు. సార్వత్రిక ఎన్నికల్లో గట్టెక్కేందుకు గంపెడు హామీలు ఇచ్చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక నెరవేర్చకుండా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వ్యవహార శైలితో అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఒక్క వర్గం ఆనందంగా లేని పరిస్థితి. ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారానికి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పింఛన్లలో కోత విధించడంతో దివ్యాంగులు రోడ్డెక్కి ధర్నాలు చేసిన దుస్థితి కళ్లకు కట్టింది. తాజాగా ఆ జాబితాలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు సైతం చేరారు. ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించకపోవడంతో వారు తాత్కాలికంగా స్టెతస్కోప్‌ పక్కన పెట్టి.. సమ్మె బాట పట్టారు.

పట్టింపేదీ..

గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో పీహెచ్‌సీలది కీలక భూమిక. అంతటి ప్రాధాన్యం ఉన్న పీహెచ్‌సీ వైద్యులపై కూటమి ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా స్పందించలేదు. చేసేది లేక వైద్యులు సమ్మె బాట పట్టారు. దశల వారీ ఆందోళనకు కార్యాచరణ రూపొందించారు. ప్రభుత్వానికి ఇప్పటికే సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. ప్రభుత్వం స్పందిస్తుందని గురువారం వరకూ ఎదురు చూశారు. ఎలాంటి స్పందనా లేకపోవడంతో పూర్తి స్థాయి సమ్మెకు దిగుతామని పేర్కొంటూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్‌ఓ)కి శనివారం వినతిపత్రం అందజేశారు.

ఇవీ సమస్యలు

ఫ జిల్లావ్యాప్తంగా 40 పీహెచ్‌సీలున్నాయి. వాటిలో 90 మంది వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులకు వ్యతిరేకమైన జీఓ నంబర్‌ 99 అమలు నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఫ పీహెచ్‌సీల్లో వైద్యాధికారులుగా పని చేస్తున్న వారికి పీజీలో 30 శాతం సీట్ల కోటా ఉండేది. దీనిని కూటమి ప్రభుత్వం గత ఏడాది 15 శాతానికి తగ్గించింది. దీనిపై ఆందోళన చేస్తే 20 శాతానికి పెంచింది. ఏటా ఇదే విధానం కొనసాగిస్తుందని వారు భావించగా.. ఒక ఏడాది మాత్రమే అమలు చేసి, ఇప్పుడు పట్టించుకోవడం లేదు. దీనిపై పీహెచ్‌సీ వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ 2020లో రిక్రూట్‌ అయిన వైద్యులకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది.

ఫ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలో ఎంతో మంది వైద్యులు ఒకే క్యాడర్‌లో 20 ఏళ్ల నుంచి పని చేస్తున్నా, ప్రమోషన్లు ఇవ్వడం లేదు. గతంలో టైమ్‌ బౌండ్‌ ప్రమోషన్లు ఇస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు.

ఫ ఏజెన్సీలో పని చేస్తున్న వైద్యులకు 30 శాతం అలవెన్స్‌ వస్తోంది. అదే ప్రాంతంలో పని చేస్తున్న డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిధిలో ఉన్న వైద్యులకు మాత్రం ఈ అలవెన్స్‌ ఇవ్వడం లేదు. దీంతో పాటు సీఎస్‌ఈ అలవెన్స్‌ సైతం ఇవ్వడం లేదు.

ఫ నోషన్‌ ఇంక్రిమెంట్లలోనూ కూటమి ప్రభుత్వం మెండిచేయి చూపడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

ఉద్యమ కార్యాచరణ

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించేంత వరకూ దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. దీనికి కార్యచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా తొలి రోజైన శనివారం డీఎంహెచ్‌ఓకు వినతిపత్రం అందజేశారు. పీహెచ్‌సీల్లో అన్ని ఆన్‌లైన్‌ సేవలకు శుక్రవారం నుంచి బ్రేక్‌ ఇచ్చారు. శనివారం నుంచి క్షేత్ర స్థాయిలో సంచార చికిత్స, వైద్య శిబిరాలు తదితర సేవలు నిలిపివేశారు. అదివారం అన్ని అధికారిక వాట్సాప్‌ గ్రూపుల నుంచి ఎగ్జిట్‌ అవుతారు. సోమవారం ఓపీ సేవలు బహిష్కరిస్తారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కాన్పులు, పాముకాటు తదితర అత్యవసర వైద్య సేవలు అందిస్తారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. వచ్చే నెల 1న జిల్లా కేంద్రంలో ప్లకార్డులు చేబూని ర్యాలీ, ధర్నా నిర్వహిస్తారు. వచ్చే నెల రెండో తేదీన చలో విజయవాడ నిర్వహిస్తారు.

ఫ కూటమి సర్కారు విధానాలపై

అసంతృప్తి

ఫ సమ్మె ప్రారంభించిన పీహెచ్‌సీ వైద్యులు

ఫ ఇప్పటికే ఆన్‌లైన్‌ సేవల నిలిపివేత

ఫ ప్రభుత్వం స్పందించకుంటే అన్ని

వైద్య సేవలూ నిలిపివేయాలని నిర్ణయం

స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం

గ్రామీణ ప్రజలకు వైద్యం అందించే మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ప్రస్తుతం రోగులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే ఆందోళన ఉధృతం చేయక తప్పదు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ రూపొందించాం.

– డాక్టర్‌ మౌనిక, జిల్లా అధ్యక్షురాలు, పీహెచ్‌సీ వైద్యుల సంఘం

స్టెతస్కోప్‌ వీడి.. సమ్మెబాటలో..1
1/1

స్టెతస్కోప్‌ వీడి.. సమ్మెబాటలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement