
ఉగ్ర గోదారి
ధవళేశ్వరం: ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద ఉధృతితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. బ్యారేజీ నుంచి శనివారం ఉదయం 9 గంటలకు 6 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను విడిచిపెట్టగా.. సాయంత్రం 5 గంటలకు అది ఏకంగా 10 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. వరద ఉధృతి మరింతగా పెరగడంతో బ్యారేజీ వద్ద నీటిమట్టం రాత్రి 8 గంటలకు 12.10 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 10,25,075 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు 10,300 క్యూసెక్కులు విడుదల చేశారు. వరద ఉధృతి పెరుగుతూండటంతో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బ్యారేజీని సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో)
కాళేశ్వరం 10.70
పేరూరు 15.18
దుమ్ముగూడెం 11.96
భద్రాచలం 44.50
అడుగులు
కూనవరం 19.15
కుంట 10.85
పోలవరం 12.40
రాజమహేంద్రవరం
రైల్వే బ్రిడ్జి 16.16

ఉగ్ర గోదారి