
నర్సింగ్.. మరింత మెరుగ్గా..
● జీజీహెచ్‌లో సమూల మార్పులు
● ప్రత్యేక కార్యాచరణ అమలు
● సకాలంలో విధుల నిర్వహణ
● తొలగుతున్న వ్యత్యాసాలు
కాకినాడ క్రైం: వైద్యులతో సమానంగా రోగులకు సేవలందించడంలో నర్స్‌ల పాత్ర కీలకం. నిస్సత్తువతో ప్రాణాలు కళ్లలో పెట్టుకుని బతుకీడుస్తున్న రోగుల హృదయాల్లో వారి స్థానం ఎంతో ఉన్నతం. కన్నతల్లిని, తోబుట్టువుని మరిపించే ఆత్మీయత వారి సొంతం. వారి సేవలు మరింత మెరుగుపడేలా కాకినాడ జీజీహెచ్‌లో అంకురార్పణ పడింది. ఈ మేరకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పర్యవేక్షణలో నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన మౌళి ఆధ్వర్యంలో ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రతి వార్డు పరిశీలన
ఆస్పత్రిలో ప్రతి వార్డును పరిశీలిస్తూ నర్సింగ్ సూపరింటెండెంట్ సహా హెడ్ నర్స్‌లు వారికి అందుతున్న సేవలపై రోగులను ఆరా తీస్తున్నారు. నర్సులు, నర్సింగ్ విద్యార్థుల ప్రవర్తన స్నేహపూర్వకంగా ఉంటున్నదీ లేనిదీ అడిగి తెలుసుకుంటున్నారు.
తారతమ్యాలు రూపుమాపేలా...
నర్సుల్లో రెగ్యులర్, కాంట్రాక్టు అనే భేదం లేకుండా చూస్తున్నారు. ఎవరెంత అనుకున్నా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంటుంది. తమ అదృష్టం పండి అర్హత తక్కువగా ఉండీ కూడా రెగ్యులర్ ఉద్యోగులుగా కొనసాగుతున్న కొందరు నర్సులు, ఉన్నత చదువులు చదివి కాంట్రాక్టు నర్సులుగా పనిచేస్తున్న వారిపై అజమాయిషీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పని విషయంలోనూ కాంట్రాక్టు సిబ్బందిపై పని భారాన్ని మోపుతుంటారు. అలాగే ఆస్పత్రిలో ఉన్నతాధికారులతోనూ రెగ్యులర్ సిబ్బందే టచ్‌లో ఉంటారు. అధికారులు సైతం రెగ్యులర్, కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బందిని సమానంగా చూడకపోవడం మరో సమస్య. నైట్ డ్యూటీ విషయంలోనూ ఇదే వ్యత్యాసం. కాగా నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన తాజా నిర్ణయంతో అసమానతలకు చెక్ పట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అందులో భాగంగా అందరికీ సమానంగా నైట్ డ్యూటీలు వేస్తున్నారు. రుబాబులకు కాలం చెల్లింది. ఏళ్లకు ఏళ్లు ఒకే వార్డులో కొనసాగుతున్న 49 మంది నర్సులకు స్థాన చలనం కల్పించారు. వివిధ సమస్యలతో పాటు అంతర్గత విభేదాలనూ అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. సమయ పాలన విషయంలోనూ నిర్థిష్ట సమయానికి పది నిమిషాలు గ్రేస్ పిరియడ్ ఇచ్చి విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.
ఆహారంలోనూ జాగ్రత్తలు
రోగులకు అందిస్తున్న ఆహారాన్ని అందరికీ అందజేయడంతో పాటు నాణ్యతను పరిశీలించి నర్సింగ్ సూపరింటెండెంట్‌కు నివేదించే ఏర్పాటు చేశారు.
క్లీన్ చేశాక క్లిక్ తప్పనిసరి
వార్డులు శుభ్ర పరిచాక స్టాఫ్ నర్సులు ఫొటోలు తీసి గ్రూప్‌లో అప్‌లోడ్ చేయడం తప్పనిసరి. వార్డు పరిశుభ్రతను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. రోగి మంచంపై దుప్పట్లు మార్చడంలో నర్సులు సంబంధిత సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇస్తున్నారు. రోగికి అనుగుణంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు.
రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తూ..
రోగులకు వడ్డిస్తున్న నర్సులు
మంచి దిశగా అడుగులు
రోగులకు మంచి జరిగేలా నర్సింగ్ సూపరింటెండెంట్ కల్పన మౌళి ఆధ్వర్యంలో నర్సింగ్ బృందం వారి సేవల్లో సానుకూల మార్పులు తీసుకువచ్చారు. తాజా మార్పులను ఆహ్వానిస్తున్నాం. మంచి దిశగా అడుగులు పడే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు అండగా ఉంటాం. రోగుల సంరక్షణే పరమావధి.
– డాక్టర్ లావణ్యకుమారి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ
ఉత్తమ నర్సింగ్ సేవలే లక్ష్యం
కాకినాడ జీజీహెచ్‌లో ఉత్తమ నర్సింగ్ సేవలే లక్ష్యంగా సానుకూల మార్పులకు శ్రీకారం చుట్టాం. అమలు చేసే క్రమంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నాం. చేపట్టిన మార్పులు రోగులకు మంచి చేస్తుంటే తాము పడిన కష్టం మర్చిపోతున్నాం. నర్సులు ఎంతగానో సహకరిస్తున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి సహకారంతో వార్డుల్లో నర్సింగ్ సేవలపై నిశిత పరిశీలన చేపట్టి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– టీఎన్ కల్పన మౌళి, గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ

నర్సింగ్.. మరింత మెరుగ్గా..

నర్సింగ్.. మరింత మెరుగ్గా..

నర్సింగ్.. మరింత మెరుగ్గా..

నర్సింగ్.. మరింత మెరుగ్గా..