
సమర్థంగా తీవ్రవాదుల ఏరివేత
● ఓఎన్‌జీసీలో ‘ఆపరేషన్ పుష్కర్’
● వివిధ శాఖల సమన్వయంతో మాక్‌డ్రిల్
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ కార్యాలయాల సమీప ప్రాంతాల్లో భద్రతాపరంగా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఓఎన్‌జీసీ భద్రతా విభాగం, స్థానిక పోలీసు అధికారులు, ఏపీఎస్‌పీఎఫ్, ఏపీ పోలీసుల ఆక్టోపస్ కమాండోల మధ్య ప్రతిస్పందన, సమన్వయాన్ని పెంచడానికి గురువారం ఓఎన్‌జీసీ గోదావరి భవన్‌లో ఈ మేరకు ‘ఆపరేషన్ పుష్కర్’ నిర్వహించారు. ఓఎన్‌జీసీ కార్యాలయంలోకి ఉగ్రవాదులు చొరబడి కీలక సిబ్బందిని బందీలుగా తీసుకుపోయే సందర్భాన్ని ఈ మాక్ డ్రిల్‌లో నిర్వహించారు. వైద్య, రెవెన్యూ, అగ్నిమాపక, ఏపీఎస్‌పీఎఫ్, బొమ్మూరు పోలీస్ స్టేషన్, జిల్లా ఆర్మ్ రిజర్వ్ స్పెషల్ పార్టీ, బాంబు డిస్పోజల్ బృందం, డాగ్ స్క్వాడ్ వంటి వివిధ సహాయక సిబ్బంది ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించాయి. ఓఎన్‌జీసీ భద్రత, అగ్నిమాపక బృందాలు ఈ ఆపరేషన్‌లో భాగస్వాములయ్యాయి. మధ్యాహ్నం 3.40 గంటలకు ఈ ఆపరేషన్ ప్రారంభించి రాత్రి 8.30 గంటల వరకు నిర్వహించారు. బందీలుగా ఉన్న కీలక సిబ్బందికి ఎటువంటి గాయాలు కాకుండా విడిపించారు. కమెండోలు గంటల తరబడి ఆపరేషన్ నిర్వహించి సమర్ధంగా కట్టడి చేశారు. రాష్ట్ర వైద్య బృందం, ఓఎన్‌జీసీ వైద్య విభాగం క్షతగాత్రులకు అవసరమైన వైద్య సహాయం అందించారు. అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలంలో సత్వర చర్యలకు సిద్ధంగా ఉన్నాయి. తరువాత, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి తనిఖీలు చేసింది. ఏఎస్పీ (ఏఆర్) చెంచురెడ్డి, డీఎస్పీలు జగ్గు నాయుడు, జి.విశ్వనాథం, విజయవాడలోని ఆక్టోపస్ స్పెషల్ ఫోర్స్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ ఆర్.రాంబాబు ఈ ఆపరేషన్‌లో బ్రీఫింగ్ చేశారు. ఇన్‌చార్జి సెక్యూరిటీ లెఫ్టినెంట్ కల్నల్ కెఎస్ గుసేన్, చీఫ్ మేనేజర్ (సెక్యూరిటీ) పి.శంకర్ ఓఎన్‌జీసి నుంచి నోడల్ అధికారులుగా వ్యవహరించారు.

సమర్థంగా తీవ్రవాదుల ఏరివేత

సమర్థంగా తీవ్రవాదుల ఏరివేత