
పాత కక్షలతో వ్యక్తిపై ముగ్గురి దాడి
బాధితుడికి 8 చోట్ల కత్తెర పోట్లు
అమలాపురం టౌన్: రెండు కుటుంబాలకు మధ్య నెలకొన్న పాత కక్షల నేపథ్యంలో ఒకరిపై ముగ్గురు వ్యక్తులు కత్తెరతో 8 చోట్ల దాడి చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన ముమ్మిడివరపు రాంబాబుపై అదే కాలనీకి చెందిన తమ్ములపల్లి పవన్‌కుమార్, భవిరిశెట్టి ధనుష్ అనే అఖిల్, భవరిశెట్టి వెంకట నర్సమ్మ టైలరింగ్ కత్తెరతో దాడిచేసి గాయపరచినట్టు కేసు నమోదైంది. వీరు మున్సిపల్ కాలనీ సమపంలోని ఆమని ఆటో మొబైల్స్ షాపు ఎదరుగా రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి ఘర్షణ పడ్డారు. కోపాద్రిక్తులైన పవన్‌కుమార్, అఖిల్ కత్తెరతో రాంబాబు శరీరంపై విచక్షణా రహితంగా పొడిచారు. ఈ సమయంలో పవన్‌కుమార్, అఖిల్‌ను దాడికి పురిగొల్పిన భవిరిశెట్టి వెంకట నరసమ్మపై కూడా కేసు నమోదైంది. ఇదలా ఉంటే తొలుత ముమ్మిడివరపు రాంబాబే తమ్మలపల్లి పవన్‌కుమార్‌ను గాయపరిచాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. తమ్మలపల్లి పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు ముమ్మిడివరపు రాంబాబుపై కౌంటర్ కేసు నమోదైంది. సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని యువకుడి మృతి
ముమ్మిడివరం: మోటారు సైకిల్‌పై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు రాజుపాలెం సెంటర్‌లో మోటారు సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తున్న గుబ్బల వపన్‌కుమార్ (27) మోటారు సైకిల్‌పై రాజుపాలెం ఇంటికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టి పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ఈడ్చుకుపోయింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్‌కుమార్ అవివాహితుడు. అతడికి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సత్యవతి, చెల్లి ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాల చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
కె.గంగవరం: మండలంలో వాహన చోరీలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై జానీ బాషా గురువారం విలేకరులకు తెలిపారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన పెమ్మిరెడ్డి బాల వెంకట్ ఈ చోరీలకు పాల్పడ్డాడని, ఆ వాహనాలను కోటిపల్లికి చెందిన కర్రి సత్యనారాయణ అలియాస్ నాని, కె.గంగవరం గ్రామానికి చెందిన పెంటపాటి వీరబాబులకు విక్రయించినట్లు తెలిపారు. ఈ ముగ్గురిని గురువారం అరెస్టు చేసి రామచంద్రపురం కోర్టుకు తరలించడగా వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. వీరి నుంచి 6 వాహనాలను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగించినట్టు తెలిపారు. కేసును సీఐ వెంకట నారాయణ పర్యవేక్షణలో ఛేదించినట్టు తెలిపారు. కాగా వీరబాబు దగ్గర మరో 20 వరకు చోరీ చేసిన బైకులు ఉన్నట్లు సమాచారం.
అట్రాసిటీ కేసులో ఒకరి అరెస్ట్
కపిలేశ్వరపురం: మండపేట పోలీసు స్టేషన్‌లో 2019లో నమోదైన అట్రాసిటీ కేసులో నిందితుడు గాడు సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు సీఐ సురేష్ గురువారం తెలిపారు. ఈ కేసులో రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని, దాని అమలులో భాగంగా హైదరాబాద్‌లో ఉంటున్న సత్యనారాయణను అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ సురేష్ తెలిపారు.