
వివాహిత అనుమానాస్పద మృతి
నిడదవోలు: మండలంలోని శెట్టిపేట గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో వాటర్‌ట్యాంక్ ప్రాంతంలో గట్టున సత్యవతి (55) ఒంటరిగా నివసిస్తోంది. భర్త కోటయ్య గతంలో మృతిచెందారు. సత్యవతి చెల్లెలు కాకుమళ్ల దేవి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఫోన్ చేయగా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంటి పక్కన ఉంటున్న కూనపురెడ్డి గంగారత్నంకు ఫోన్ చేసి మా అక్కను చూడాలని కోరింది. గంగారత్నం ఇంటికి వెళ్లి చూడగా సత్యవతి బాత్రూరూంలో రక్తపు మడుగులో పడి ఉండటం గమనించింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా పట్టణ ఎస్సై జగన్‌మోహన్‌రావు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి చెల్లెలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సమిశ్రగూడెంలో
రెండు చోట్ల చోరీలు
నిడదవోలు రూరల్: మండలంలోని సమిశ్రగూడెంలో గురువారం తెల్లవారు జామున రెండుచోట్ల జరిగిన దొంగతనాలపై కేసులు నమోదైనట్టు ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు అన్నారు. సమిశ్రగూడెంలోని శ్రీనివాస మెడికల్ షాప్ వీధిలో దంగుల కొండమ్మ ఇంట్లో రూ.80 వేల నగదుతో పాటు 26 తులాల వెండీ, అరకాసు బంగారం, కాల్వగట్టుపై ఉన్న కొండేపూడి సుధీర్‌కు చెందిన టీ టైం షాపులో రూ.20 వేల నగదు, 6 గ్రాముల బంగారం, ఒక సెలఫోన్ అపహరించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. చోరీ జరిగిన ప్రాంతాలను ఎస్సై బాలాజీ సుందరరావు పరిశీలించి బాధితుల నుంచి వివరాలు అడిగి నమోదు చేసుకున్నారు.

వివాహిత అనుమానాస్పద మృతి