
పరమేశు బయోటెక్‌కు ఉత్తమ పురస్కారం
దేవరపల్లి: ఫుడ్ ప్రాసెసింగ్‌లో సంవత్సరపు ఉత్తమ కంపెనీగా ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు–2025ను స్థానిక పరమేశు బయోటెక్ పరిశ్రమ దిక్కించుకుంది. సంస్థ ఎండీ ఆదవాని ఆనంద్ స్వరూప్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మొక్కజొన్న ఆధారిత స్పెషాలిటీ ఉత్పత్తుల దిగ్గజ సంస్థకు బెస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఫుడ్ ప్రొసెసింగ్ పురస్కారం దక్కించుకున్నట్టు ఆనంద్ స్వరూప్ పేర్కొన్నారు. విశిష్ట వృద్ధి సాధిస్తూ నవకల్పనలతో గ్రామీణాభివృద్ధిలో కీలక సేవలు అందిస్తున్నందుకు తమ కంపెనీకి ఈ పురస్కారం దక్కిందని ఆయన అన్నారు. 2015లో 160 టీపీడీ సామర్ధ్యంతో రూ.10 కోట్ల టర్నోవర్ నుంచి 2025 నాటికి 900 టీపీడీ సామర్ధ్యం, రూ.770 కోట్ల టర్నోవర్‌కు ఎదిగినట్టు ఆయన చెప్పారు. కంపెనీ ప్రత్యక్షంగా 400 మంది సిబ్బందికి, పరోక్షంగా 500 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. లక్షకు పైగా రైతు కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. అలాగే వేస్ట్–టు–వెల్త్ మోడల్‌ను తమ సంస్థ అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం 1200 టీపీడీ ప్లాంటును ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. రెట్టింపు స్థాయిలో ఉద్యోగాల కల్పనతో పాటు గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టిపెడుతున్నట్టు ఆయన చెప్పారు.