
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
అల్లవరం: కొమరగిరిపట్నం రెవెన్యూ సముద్ర తీరం వెంబడి సీఆర్‌జెడ్ పరిధిలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేస్తూ రాత్రి వేళల్లో సాగుతున్న అక్రమ రవాణాను ఊటగుంట సావరం గ్రామస్తులు బుధవారం రాత్రి అడ్డుకున్నారు. స్థానిక ఎంపీటీసీ పెచ్చెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొంత మంది యువకులు ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను అడ్డుకున్నారు. సీఆర్‌జెడ్ పరిధిలోని ఇసుకను తరలించడానికి వీల్లేదంటూ నిరసన తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై ఎంపీటీసీ స్థానిక తహసీల్దార్ వీవీఎల్ నరసింహరావు దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి వేళల్లో లారీల రాకపోకలతో నిద్ర కోల్పోతున్నారని వారు తహసీల్దార్, అల్లవరం పోలీసులకు తెలిపారు. దీనిపై స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇసుక రవాణా చేస్తున్న లారీలను స్వాధీనం చేసుకున్నారు.