రాజకీయ సంగ్రామం | - | Sakshi
Sakshi News home page

రాజకీయ సంగ్రామం

Sep 18 2025 7:15 AM | Updated on Sep 18 2025 7:15 AM

రాజకీయ సంగ్రామం

రాజకీయ సంగ్రామం

సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2026 జనవరి నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో ఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం 2026 ఏప్రిల్‌ నెలతో ముగియనుంది. ఇదిలా ఉంటే ముందస్తుగానే ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఎన్నికల కమిషన్‌ ప్రకటనతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్న నేతల్లో ఉత్సాహం నెలకొంది. తమకు అభ్యర్థిత్వం ఖరారు చేయాలంటూ ఆయా పార్టీల నేతలను ఆశ్రయిస్తున్నారు. మరో వైపు ఓటర్ల జాబితా రూపొందించడం, పోలింగ్‌ కేంద్రాలు, రిజర్వేషన్ల ఖరారు లాంటి అంశాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు బిడ్డల కన్నా మించి ఉంటే పోటీకి అర్హులవుతారని, ఆ విధంగా చట్టం తెస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై నేతల్లో అంతర్మథనం నెలకొంది. అదే జరిగితే తాము పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న మీమాంస నెలకొంది.

గ్రామీణ ప్రాంతాల్లో గరం గరం

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. ఏ గ్రామంలో చూసినా.. ఏ సెంటర్‌లో విన్నా ఎన్నికల చర్చే నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సూపర్‌సిక్స్‌ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల నుంచి ఛీత్కారాలు తప్పడం లేదు. సంపద సృష్టి పేరుతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలకు దిగడం, బెల్ట్‌ షాపులు నడపడంతో ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. రైతులకు అత్యవసరమైన ఎరువులు, యూరియా అవసరమైన మేరకు అందించడంతో ఘోరంగా విఫలమైంది. వెరసి రైతులు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌ సీపీ ఆందోళనలు తీవ్రం చేయడం.. ప్రజల పక్షాన నిలబడటంతో ప్రజలు వైఎస్సార్‌ సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు.

రిజర్వేషన్లపై ఉత్కంఠ

స్థానిక ఎన్నికల దృష్ట్యా వార్డు రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. తమ గ్రామాల్లో ఏ వార్డు ఏ రిజర్వేషన్‌ వస్తుందో..? అన్న విషయమై పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా వస్తే ఓకే.. లేదంటే ఆ స్థానంలో ఎవరిని నిలబెట్టాలి..? వారి గెలుపునకు ఎలా కృషి చేయాలన్న లెక్కలు వేసుకుంటున్నారు.

ఉమ్మడి తూర్పులో ఇలా..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లు 7, మండలాలు 64, మండల ప్రజా పరిషత్తులు 57, పంచాయతీలు 1,012, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు 9, పట్టణాలు 14, గ్రామాలు 1379 వున్నాయి. మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ, సర్పంచ్‌ తదితర ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.

ఇదీ సంగతి..

2018లో స్థానిక సంస్థల ఎన్నికలు (గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు) జరగాల్సి ఉండగా.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం వాయిదా వేసింది. 2021లో గ్రామ పంచాయతీలకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. వాటి కాల పరిమితి రెండు నెలలు అటు.. ఇటు.. 2026 ఏప్రిల్‌ నెలతో ముగియనుంది.

షెడ్యూల్‌ ఇలా..

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికలపై పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులకు లేఖ పంపింది. లేఖ ప్రకారం షెడ్యూల్‌ పరిశీలిస్తే...

అక్టోబర్‌ 15: వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి

అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 15: వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పన

నవంబర్‌ 1 నుంచి 15: ఎన్నికల అధికారుల నియామక ప్రక్రియ

నవంబర్‌ 16: పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంలు సిద్ధంగా ఉంచాలి

డిసెంబర్‌ 15: వార్డులు, మున్సిపల్‌ చైర్మన్లు, ఎంపీపీ, సర్పంచ్‌ స్థానాలకు రిజర్వేషన్లు వెల్లడించాలి.

డిసెంబర్‌ నెల చివరిలో రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి.

2026: జనవరి నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి, ఎన్నికలు నిర్వహించాలి. ఫలితాలు సైతం వెల్లడించాలి.

ఫ స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌

ఫ నిర్వహణకు సిద్ధం

కావాలంటూ అధికారులకు ఆదేశాలు

ఫ రిజర్వేషన్లపై మల్లగుల్లాలు

ఫ గ్రామీణ ప్రాంతాల్లో

వేడెక్కిన రాజకీయం

ఫ అభ్యర్థుల సంతానం,

అర్హతపై సందిగ్ధత

ఫ నియోజకవర్గ

ఇన్‌చార్జ్‌ల వద్దకు పరుగులు

అర్హతపై ఆందోళన

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అర్హత విషయంలో గందరగోళం నెలకొంది. దేశంలో అధిక జనాభా కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో శ్రీఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దుశ్రీ అనే నినాదం మారుమోగింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న చట్టం తీసుకొచ్చింది. మగవాళ్లకు వేసక్టమీ శస్త్రచికిత్సలను సైతం ప్రోత్సహించారు. ఇద్దరు పిల్లలుంటే మంచిదన్న ప్రచారం విస్తృతం చేశారు. దీంతో చాలా మంది ఇద్దరు పిల్లలతోనే సరిపెట్టుకున్నారు. తాజా పరిణామాలు అందుకు భిన్నంగా మారుతున్నాయి. ప్రపంచ జనాభా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అధిక జనాభా దేశానికి శక్తి అంటూ సీఎం చంద్రబాబు నినాదంగా పెట్టుకున్నారు. ప్రతి సమావేశంలోనూ పిల్లలను కనండంటూ ప్రసంగాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉండాలన్న నిబంధన తీసుకొస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అదే జరిగితే ఇద్దరు పిల్లలున్న వారంతా పోటీకి దూరమవుతారు. ఈ పరిణామం పోటీదారుల్లో ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement