
స్వచ్ఛతాహీ సేవలో జిల్లాను మేటిగా నిలుపుదాం
రాజమహేంద్రవరం సిటీ: స్వచ్ఛతాహీ సేవ 2025 కార్యక్రమం అమలులో జిల్లాను అగ్రగామిగా నిలుపుదామని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ వరకు స్వచ్ఛతాహి సేవా పురస్కరించుకుని బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎంపీ పురంధరేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధం, పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, త్రిపుల్ ఆర్ (రెడ్యూస్డ్–రీయూజ్–రీసైకిల్), స్వచ్ఛ భారత్‌పై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్లకార్డులను ప్రదర్శించారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఘనంగా ప్రారంభమై అక్టోబరు 2వ తేదీ గాంధీ జయంతితో ముగుస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎంహెచ్‌ఓ వినూత్న, సిటీ ప్లానర్ కోటయ్య, మేనేజర్ ఎండీ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ ఆఫీసర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.