
మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
రాజమహేంద్రవరం సిటీ: 2027లో మహా గోదావరి పుష్కర పనులు, నగరాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఆర్‌ఎంసీ పరిధిలో చేపడునున్న, ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మళ్లింపు, రవాణా, ఘాట్ల అభివృద్ధి, తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సమగ్రంగా చర్చించారు. అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు కోసం రూపొందించిన అంశాలు, నిధుల కేటాయింపులపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి శాఖ ఆధ్వర్యంలో డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రహదారులు, డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేసి, పంచాయతీలకు వచ్చే ఆదాయాన్ని అదే పంచాయతీ అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలని సూచించారు. రాబోయే పుష్కరాల దృష్ట్యా రూ.456 కోట్లతో రహదారులు, డ్రైన్ల పనులు చేపట్టనున్నామని వివరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 పుష్కరాల దృష్ట్యా క్రౌడ్ మేనేజ్‌మెంట్, ఘాట్ల అభివృద్ధి, ట్రాఫిక్ మళ్లింపు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. సమావేశంలో ఆర్‌ఎంసీ అధికారులు, రుడా అధికారులు పాల్గొన్నారు.