
ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పాఠశాల విద్యారంగ సమస్యలపై ఈ నెల 25న విజయవాడలో యూటీఎఫ్ నిర్వహిస్తున్న రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి కోరారు. గోకవరంలో 300 మంది యూటీఎఫ్ కార్యకర్తలతో ప్రారంభమైన బైక్ జాతా రాజమహేంద్రవరం చేరింది. స్థానిక కోరుకొండ రోడ్డులోనున్న యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీ కమిటీని ప్రకటించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావలసిన సుమారు రూ.20 వేల కోట్ల బకాయిను వెంటనే చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశక్తి కార్యక్రమాలు, పరీక్షల మూల్యాంకనాలు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్, గ్రీన్ పాస్‌పోర్ట్ మొదలైన బోధనేతర కార్యక్రమాలతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో రణభేరి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ఈ సమస్యలపై ఎలుగెత్తి చెబుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను కూడా చెల్లించాలన్నారు. ఈనెల 18 నుంచి జరిగే శాసనమండలి సమావేశాల్లో ఈ సమస్యలపై చర్చిస్తానన్నారు. రాష్ట్ర కార్యదర్శిఎన్.అరుణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సి వేయాలన్నారు. అలాగే మధ్యప్రతిని ప్రకటించాలన్నారు. బైక్ జాతా కడియం మీదుగా కోనసీమ జిల్లా మండపేటకు వెళ్లింది. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శిలు జ్యోతిబసు, టి.చక్రవర్తి, వివిధ జిల్లాల కార్యదర్శులు చిలుకూరి శ్రీనివాసరావు, కే.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ గోపిమూర్తి
ఫ 25న విజయవాడలో రణభేరి