డేంజర్‌లో ఓజోన్‌ | - | Sakshi
Sakshi News home page

డేంజర్‌లో ఓజోన్‌

Sep 16 2025 7:39 AM | Updated on Sep 16 2025 7:39 AM

డేంజర

డేంజర్‌లో ఓజోన్‌

రాయవరం: ఎండ, వాన నుంచి మనకు గొడుగు ఎలా రక్షణ ఇస్తుందో కంటికి కనిపించని ఓజోన్‌ పొర కూడా భూమిపై జీవరాశిని అలానే కంటికి రెప్పలా కాపాడుతోంది. అభివృద్ధి పేరిట కాలుష్యాన్ని పెంచి పోషిస్తుండడం వల్ల ఓజోన్‌ పొరకు నేడు ప్రమాదం ఏర్పడింది. తుపానులో సుడిగాలికి చేతిలోని గొడుగు అల్లాడినట్లు కాలుష్యం తాకిడికి ఓజోన్‌ రక్షణ ఛత్రం విలవిల్లాడుతుతోంది. ఇది చిల్లులు పడినా జల్లెడలా తయారైందంటే జీవరాశి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. వనాలు పెంచి.. కాలుష్యాన్ని తుంచి ఓజోన్‌ పొరను రక్షించుకుంటేనే.. అది మనల్ని రక్షిస్తుంది. ఓజోన్‌ రక్షిత..రక్షితః అంటూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబరు 16న ఓజోన్‌ పొర పరిరక్షణ దినోత్సవంగా పాటిస్తున్నారు.

దుష్ఫలితాలివీ..

’ఓజోన్‌ పొర క్షీణిస్తుండడంతో అతినీలలోహిత కిరణాలు భూమిపైకి చేరుతున్నాయి. ’ఫలితంగా మనుషుల్లో చర్మ సంబంధ వ్యాధులు, రోగ నిరోధక శక్తి తగ్గడం, కంటి సంబంధ వ్యాధులు, చర్మ, క్యాన్సర్‌ బారినపడే అవకాశం ఉంది. జంతువులపై ఇవి మరింత తీవ్ర పరిణామాలు చూపుతున్నాయి. ’మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ రేటు తగ్గి మొక్కల ఆహార తయారీలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ’సముద్ర జీవజాలంపై పరోక్షంగా ఈ ప్రక్రియ ప్రభావితం చూపిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ’ఉష్ణోగ్రతలు పెరిగి, భూమి అగ్నిగోళంలా మారుతుందనే హెచ్చరికలు లేకపోలేదు.

ఆకాశం నీలంగా కనిపించడానికి..

పగటి సమయంలో ఆకాశం నీలంగా కనిపించడానికి ప్రధాన కారణం ఓజోన్‌ పొర. సూర్యుని నుంచి బయలుదేరిన కిరణాలు భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. ఈ సూర్య కిరణాల్లో జీవావరణానికి ఉపయోగపడే కిరణాలతో పాటు జీవరాశికి వినాశనం కలిగించే అతి నీలలోహిత (ఆల్ట్రా వయోలెట్‌) కిరణాలు కూడా ప్రసరిస్తాయి. ఈ అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమికి చేరినట్లయితే దాని వల్ల జరిగే రసాయన చర్య వల్ల భూమండలం మొత్తం రేడియేషన్‌ వ్యాపిస్తుంది. తద్వారా జీవుల మనుగడ కష్టమవుతుంది. భూమి నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఎటువంటి రంగు లేకుండా రక్షణ కవచంలా ఉన్న పొరనే ఓజోన్‌ పొర అంటారు. సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలను ఈ పొర అడ్డుకోవడం వల్ల మనకు పగటి సమయంలోనూ ఆకాశం నీలి రంగులో కన్పిస్తుంది. సూర్యుడు తొలగిన వెంటనే ఎటువంటి నీల లోహిత కిరణాలు ఈ పొరపై ఉండవు. కాబట్టి ఈ పొరగుండా మనం నక్షత్రాలను చూడగలుగుతున్నాం.

అభివృద్ధి పేరిట వినాశనం

అభివృద్ధి పేరిట ఈ భూమిపై మానవులు వినాశనం సృష్టిస్తున్నారు. కాలుష్యం మూలంగా ఈ ఓజోన్‌ పొర నెమ్మదిగా కరిగి రంధ్రాలు పడుతున్నట్లు పర్యావరణ నిపుణులు గుర్తిస్తున్నారు. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్‌లు ఈ ఓజోన్‌ పొరపై తీవ్ర ప్రభా వం చూపుతున్నాయి. ఆధునిక జీవనం పేరిట రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషన్ల వాడకం పెరగడం కూడా పొరపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటి నుంచి వెలువడే గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ వాయువులు పర్యావరణ వినాశనం కావున ఓజోన్‌ పొరకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి.

జిల్లాలో పరిస్థితి ఇదీ

ప్లాస్టిక్‌ వాడకం, వాయు కాలుష్య నివారణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అడవులు పర్యావరణానికి ఎంతో రక్షణగా నిలుస్తాయి. ఉమ్మడి జిల్లా విస్తీర్ణంలో 33 శాతం అడవులు ఉండాల్సి ఉండగా, 336 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. జిల్లా విస్తీర్ణంలో 32 శాతం అడవులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లా అటవీశాఖ పర్యవేక్షణలో 7 టెర్రిటోరియల్‌ రేంజ్‌లు, 42 టెర్రిటోరియల్‌ సెక్షన్లు, 95 బీట్లు ఉన్నాయి.

మానవ తప్పిదాలే అధికం

మానవ తప్పిదాల వల్లే ఓజోన్‌ పొరకు చిల్లులు పడే ప్రమాదం కలిగింది. దీని నుంచి సమస్త జీవరాశి మనుగడ సాగించాలంటే ప్లాస్టిక్‌, విష వాయువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి.

– జీవీఎస్‌ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్‌ అధికారి,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

పశు పక్ష్యాదులపై దుష్ప్రభావం

ఓజోన్‌ పొరను రక్షించుకోకుంటే ఆ ప్రభావం సమస్త మానవాళితో పాటు పశుపక్ష్యాదులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే సెల్‌ టవర్ల రేడియేషన్‌ వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. ఓజోన్‌ పొరను కాపాడుకుంటే భూతాపాన్ని కాపాడుకోవచ్చు.

– నల్లమిల్లి సురేష్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌,

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆలమూరు

సమష్టి బాధ్యతగా చేపట్టాలి

మొక్కలు నాటడంతోనే సరికాదు. వాటిని సంరంక్షించుకున్నప్పుడే అడవులు పెరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ అనేది సమష్టి బాధ్యతగా చేపట్టాలి. అప్పుడే అడవుల విస్తీర్ణం పెరిగి, పర్యావరణ సమతుల్యత ఉంటుంది.

– ఎంవీ ప్రసాదరావు, జిల్లా అటవీ అధికారి,

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

పర్యావరణ పరిరక్షణకు నిర్లక్ష్యమే కారణం

దెబ్బతింటున్న వాతావరణ సమతుల్యత

కాలుష్యంతో ఏటా

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

నేడు ప్రపంచ ఓజోన్‌ దినోత్సవం

డేంజర్‌లో ఓజోన్‌ 1
1/3

డేంజర్‌లో ఓజోన్‌

డేంజర్‌లో ఓజోన్‌ 2
2/3

డేంజర్‌లో ఓజోన్‌

డేంజర్‌లో ఓజోన్‌ 3
3/3

డేంజర్‌లో ఓజోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement