
నూతన ఆవిష్కరణలతో ముందంజ వేయాలి
రాజానగరం: ఆదికవి నన్నయ అందించిన జ్ఞానం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య చూపిన శ్రద్ధ నుంచి ప్రేరణ పొంది, నూతన ఆవిష్కరణలతో ముందంజ వేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ విద్యార్థులకు సూచించారు. క్యాంపస్‌లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ‘అద్విక–25’ ఇంజినీరింగ్ ఫెస్ట్‌ని సోమవారం దీపారాధనతో ప్రారంభించారు. తొలుత భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలు భారతదేశంలో ఇంజినీరింగ్ నైపుణ్యానికి బంగారు బాటలు వేశాయన్నారు. ఇంజినీరింగ్ అంటే సమీకరణలు, గణనాలు కాదని, దృష్టి, సమగ్రత, పరివర్తన ప్రభావం గురించి అనే ఆలోచనలకు ఆయన జీవితం ఒక నిదర్శనమన్నారు. అద్విక–25లో విద్యార్థులకు పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, టెక్ క్విజ్, ప్రాజెక్టు ఎక్సోపో, షార్ట్ ఫిల్మ్ మేకింగ్, స్కిల్ హౌస్ వంటి సాంకేతిక పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వరరావు వ్యవహరించగా రూరల్ వాటర్ సప్‌లై విభాగం ఈఈ బి.వెంకటగిరి, డీఈఈ టి.శ్రీనివాసబాబు, ఏఈ వి.అవినాష్, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ కె.తిలక్‌కుమార్, ఏపీ ట్రాన్స్‌కో ఈఈ రవికుమార్, ఐసీఐ సెంటర్ చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ కేవీ నరసింహారావు, ఓఎన్జీసీ రిటైర్డ్ ఈఈ జీఏవీ ప్రసాద్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.