
ఖతార్ నుంచి ఇంటికి చేరిన కనకమహాలక్ష్మి
కాట్రేనికోన/అమలాపురం రూరల్: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు పంచాయతీ మొక్కలతిప్ప జైభీమ్ నగర్‌కు చెందిన గోడి కనకమహాలక్ష్మి బతుకుదెరువు కోసం ఖతార్ దేశానికి వెళ్లింది. అయితే ఇటీవల తీవ్ర అనారోగ్యం, పనిఒత్తిడి అధికంగా ఉందని, యజమానుల నుంచి వేధింపులు అధికంగా ఉన్నాయని కన్నీరు మున్నీరవుతూ కనకమహాలక్ష్మి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై స్పందించిన కలెక్టర్ మహేష్ కుమార్ కనకమహాలక్ష్మిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోనసీమ సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ (కేసీఎం) అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలతో కేసీఎం బృందం భారత రాయబార కార్యాలయం అధికారులతో సంప్రదింపులు జరిపి కనకమహాలక్ష్మిని స్వదేశానికి రప్పించినట్లు కేసీఎం నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఇంటి యజమానులు వేధింపులు అధికం కావడంతో ఇంటికి చేరుకుంటానని అనుకోలేదని, సురక్షితంగా ఇంటికి చేర్చిన జిల్లా కలెక్టర్, కేసీఎం బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
ముగిసిన టెన్నికాయిట్ పోటీలు
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రెండు రోజులు పాటు నిర్వహించిన ఏపీ టెన్నికాయిట్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. మహిళల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన పి.మౌనిక ప్రఽథమ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జి.హేమమాధురి ద్వితీయ, విజయనగరం జిల్లాకు చెందిన పి.రేణుక తృతీయ స్థానాల్లో నిలిచారు. పురుషుల విభాగంలో కాకినాడ జిల్లాకు చెందిన పీజేఎండీ రామారావు ప్రథమ, వి.వినయ్‌కుమార్ ద్వితీయ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.సిద్ధార్థ తృతీయ స్థానాల్లో నిలిచారు. వారిని అథిథులు సత్కరించారు. కార్యక్రమంలో 50 మంది కోచ్ కం మేనేజర్స్ టెక్నికల్ ఆఫీసర్లు పోటీల నిర్వహణలో కృషి చేశారు.
వ్యక్తి అదృశ్యం
రాజానగరం: మండలంలోని సూర్యారావుపేటలో నివాసం ఉంటున్న తన బావ షేక్ మంసూర్ బాషా ఆగస్టు 30 నుంచి కనిపించడం లేదని, అతని ఆచూకీ తెలుసుకోవలసిందిగా సయ్యద్ అల్లా భకాష్ స్థానిక పోలీసులను ఆదివారం విజ్ఞప్తి చేశాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన తాము జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో టైల్స్ పనుల నిమిత్తం ఎనిమిది మంది ఇక్కడకు వచ్చి, సూర్యారావుపేటలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నామన్నాడు. అయితే ఆగస్టు 30న సాయంత్రం అక్కకు ఫోన్ చేసి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పిన తన బావ ఇంతవరకు ఇంటికి చేరలేదన్నాడు. స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద గాలించి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నాడు. ఈ మేరకు కేసు =దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పీవీ నారాయణస్వామి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9440796585, 7780681168 నంబర్లకు ఫోన్ చేసి, సమాచారం ఇవ్వాలని కోరారు.

ఖతార్ నుంచి ఇంటికి చేరిన కనకమహాలక్ష్మి