
న్యాయం కోసం మహిళ పోరాటం
సీతానగరం: మండలంలోని కూనవరంలో ఓ అమానుష ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే రాపాకకు చెందిన జ్యోతికి కూనవరానికి చెందిన సుంకర వీరబాబుతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల కుమారుడు చైతన్య ఉన్నాడు. గత ఐదేళ్ల క్రితం వీరబాబు కనిపించకుండా వెళ్లిపోవడంతో సీతానగరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, తనకు, తన కుమారుడికి పోషణ ఇవ్వాలని కోరుతూ జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కాగా గత నెల 28న అనకాపల్లి జిల్లా పరవాడ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో వీరబాబు మృతి చెందాడు. వీరబాబు మృతి చెందాడన్న విషయం కోడలికి చెప్పకుండా అత్త గంగాభవాని మృతదేహాన్ని రాజమహేంద్రవరం కై లాసగిరికి తీసుకువచ్చింది. భర్త మరణించాడని, అంత్యక్రియలు జరుగుతున్నాయని స్థానికుల సమాచారంతో జ్యోతి తన తల్లిదండ్రుల సహకారంతో కుమారుడు చైతన్యను తీసుకుని రాజమహేంద్రవరం చేరుకుని కుమారుడితో అంత్యక్రియలు జరిపించి అత్తింటికి చేరుకుంది. శనివారం (ఈనెల 13) కుమారుడితో భర్త దిశదిన కర్మలు పూర్తి చేయించింది. పెద్ద కార్యం అనంతరం అత్త గంగాభవాని కోరుకొండలో ఉంటున్న కూతురు, అల్లుడితో కలసి కోడలు జ్యోతితో పాటు తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు గెంటివేశారు. జ్యోతి తల్లిదండ్రులు రాపాక చేరుకోగా, జ్యోతి తన అత్తింటి వద్ద ఆరుబయటే ఉండిపోయింది. ఆదివారం ఉదయం అత్త ఇంటికి తాళం వేసి కోరుకొండలోని కుమార్తె ఇంటికి వెళ్లిపోయింది. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న ఎస్సై డి.రామ్‌కుమార్ తగు చర్యలు తీసుకుంటానని విలేకరులకు తెలిపారు.
భర్త మరణం తెలుసుకుని
కుమారుడితో అంత్యక్రియలు
పెద్ద కార్యం అనంతరం
ఇంటి నుంచి కోడలు గెంటివేత
ఆదివారం పోలీసులకు ఫిర్యాదు