
అన్నవరం దేవస్థానం సెక్యూరిటీ గార్డుల నిజాయితీ
అన్నవరం: అన్నవరం దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఒక ప్రయాణికుడు మర్చిపోయిన రూ.పది లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాల బ్యాగ్‌ను పోలీసుల సమక్షంలో తిరిగి అతడికి అప్పగించి తమ నిజాయితీ చాటుకున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు కాకినాడ నుంచి విశాఖపట్నం బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు కొంతమంది రత్నగిరి సత్యదేవుని ఆలయానికి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్ టోల్‌గేట్ వద్ద బస్సులోంచి దిగారు. వారు తమ బ్యాగులతో పాటు మరో బ్యాగ్ కూడా తీసుకుని దిగిపోయారు. అయితే ఆ తరువాత ఆ బ్యాగ్ తమది కాదని గుర్తించి ఆ బ్యాగ్‌ను దేవస్థానం సెక్యూరిటీ గార్డులకు అందజేశారు. దాంతో సెక్యూరిటీ గార్డులు ఆ బ్యాగ్‌ను తెరచి చూడగా అందులో సుమారు రూ.పది లక్షలు విలువ చేసే పది కాసుల బంగారు బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీంతో ఆ సెక్యూరిటీ గార్డులు ఆ బ్యాగ్ గురించి దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ రావుకు తెలియజేశారు. దాంతో ఆయన ఆ బ్యాగ్‌ను అన్నవరం ఎస్సై శ్రీహరిబాబుకు అప్పగించారు. ఆ బ్యాగ్ గురించి ఆ బస్సులోని వారికి ఎస్సై సమాచారం ఇవ్వగా అందులో ప్రయాణిస్తున్న షేక్ ఖాజా మొహిద్దీన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆ బ్యాగ్ తనదేనని తాను కాకినాడ నుంచి విశాఖపట్నం వెళుతున్నానని తెలిపారు. ఆ బ్యాగ్‌లో బంగారు వస్తువుల వివరాలు తెలిపి వాటిని కల్యాణ్ జ్యూయలర్స్‌లో కొన్నానని ఆ రశీదు కూడా చూపించడంతో అతని వివరాలు తెలుసుకుని నిజమని నిర్ధారించుకున్న తరువాత ఆ బ్యాగ్‌ను అతడికి అప్పగించారు. సెక్యూరిటీ గార్డులను ఎస్సై శ్రీహరిబాబు, దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ రావు అభినందించారు.
ప్రయాణికుడు మరచిపోయిన
ఆభరణాలు తిరిగి అప్పగింత