
విద్యుత్ షాక్‌తో సివిల్ కాంట్రాక్టర్ మృతి
అల్లవరం: మండలంలోని డి.రావులపాలెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వంటెద్దు నాగబాబు తూర్పులంక రెవెన్యూ పరిధిలోని గుండెపూడి డ్రైన్ ఆనుకుని ఉన్న రొయ్యల చెరువులో ఆదివారం విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. డి.రావులపాలేనికి చెందిన నాగబాబు గత కొంత కాలంగా సివిల్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఆక్వా సాగు చేస్తున్నాడు. మృతుడి కుటుంబీకుల వివరాల ప్రకారం ఇటీవల లీజుకు తీసుకున్న చెరువులో రొయ్య పిల్ల వేయడానికి ఆదివారం ఉదయం డి.రావులపాలెంలో తన ఇంటి నుంచి బయలుదేరి గుండెపూడిలో లీజుకు తీసుకున్న రొయ్యల వద్దకు వెళ్లి చెరువులో కంప లాగుతున్న క్రమంలో ఏరియేటర్ వద్ద విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. చెరువుల వద్ద సమయానికి ఎవరూ లేకపోవడంతో నాగబాబు అక్కడికక్కడే మృతి చెంది నీటిలో మునిగిపోయాడు. ఉదయం పది గంటల నుంచి మృతుడి భార్య పలుమార్లు భర్తకి ఫోన్ చేసింది. అయితే ఫోన్‌కు స్పందించకపోవడంతో కొమరగిరిపట్నంలోని తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది. సతీష్ హుటాహుటినా వెళ్లి రొయ్యల చెరువు వద్దకు వచ్చి చూడగా నాగబాబు విగతజీవుడై చెరువులో కనిపించాడు. దీంతో మృతుడి అన్నదమ్ములకు నాగబాబు మరణవార్తని సతీష్ తెలిపాడు. మృతుడి అన్నలు చెరువు వద్దకు వచ్చి నీటిలో ఏరియేటర్ వద్ద మునిగి ఉన్న తమ్ముడి మృతదేహాన్ని సతీష్‌తో కలసి ఒడ్డుకి చేర్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు కుటుంబీకులు అల్లవరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సంపత్‌కుమార్ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నెల రోజుల వ్యవధిలో తల్లి, సోదరుడుని కోల్పోవడంతో అన్నదమ్ములు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.