
కూటమికే కిక్కు..
● బార్లు దక్కించుకున్న
ఆ పార్టీల నాయకులు
● ఫలించిన సిండికేట్ కుయుక్తులు
● ఓపెన్ కేటగిరీల్లో ఆరు బార్లకే దరఖాస్తులు
● కల్లుగీత కార్మికులకు
సంబంధించి మూడు
● మొత్తం తొమ్మిదింటిలోనూ వారిదే హవా
రాజమహేంద్రవరం రూరల్: బార్లు దక్కించుకునేందుకు కూటమి నేతల సిండికేట్ చేసిన కుయుక్తులు ఫలించాయి. ఓపెన్ కేటగిరిలో 22 బార్లకు గాను రాజమహేంద్రవరంలో ఐదు, నిడదవోలులో ఒక బార్‌కు మాత్రమే నిబంధనలు మేరకు దరఖాస్తులు సమర్పించారు. అలాగే కల్లుగీత కార్మికులకు కేటాయించిన రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలులోని ఒక్కో బారుకు దరఖాస్తులు అందాయి. ఈ నేపథ్యంలో ఈ తొమ్మిది బార్లకు అధికారులు లాటరీ తీయగా, వాటినన్నింటినీ కూటమి సిండికేట్ నాయకులే దక్కించుకున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మద్యం దుకాణాలు కూటమి నేతల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు బార్ల ఏర్పాటులో కూడా వీరి హవా కొనసాగుతోంది.
జిల్లాలో 25 బార్లు
జిల్లాలో మొత్తం 25 బార్లకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. శుక్రవారం గడువు ముగిసే నాటికి ఓపెన్ కేటగిరిలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో 18 బార్లకు గాను ఐదింటికి మాత్రమే నిబంధనల మేరకు 20 దరఖాస్తులు వచ్చాయి. నిడదవోలు మున్సిపాలిటీలో రెండు బార్లకు గాను ఒక దానికి మాత్రమే నాలుగు దరఖాస్తులు అందాయి. కొవ్వూరు మున్సిపాలిటీలో ఒక బారుకు , కడియపులంకలో ఒక బారుకు దరఖాస్తులు రాలేదు. కల్లుగీత కార్మికుల కోటాలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో ఒక బారుకు నాలుగు, నిడదవోలు మున్సిపాలిటీలో ఒక బారుకు ఆరు, కొవ్వూరు మున్సిపాలిటీలో ఒక బారుకు తొమ్మిది దరఖాస్తులు అందాయి.
లాటరీ ద్వారా కేటాయింపు
రాజమహేంద్రవరంలోని ఆర్డీవో కార్యాలయంలో శనివారం లాటరీ ద్వారా బార్లను కేటాయించారు. ఆర్డీవో కృష్ణ నాయక్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలో 22 బార్లకు సంబంధించి ఒక్కో బారుకు రూ.75 లక్షల లైసెన్సు ఫీజు, రూ.5 లక్షల దరఖాస్తు ఫీజు కింద కట్టాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. బారుకు లాటరీ తీయాలంటే కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే నిబంధన పెట్టింది. ఇలా నాలుగు దరఖాస్తులకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వానికి రూ.20 లక్షల ఆదాయం రానుంది. కల్లుగీత కార్మికుల మూడు బార్లకు సంబంధించి ఒక్కో దానికి లైసెన్సు ఫీజు కింద రూ.37.50 లక్షలు చెల్లించాల్సి ఉంది.
మద్యం వ్యాపారుల సిండికేట్!
బార్లలో ఆదాయం పెంచుకునేందుకు ఎత్తుగడ వేసిన కూటమి మద్యం వ్యాపారుల సిండికేట్ బార్లకు దరఖాస్తులు చేసేందుకు ముందుకు రాలేదు. వాస్తవానికి ఆగస్టు 18న ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని బార్లకు, 20న గీత కార్మికుల బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 26వ తేదీ గడువు ముగిసే నాటికి 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. దీంతో 29వ తేదీ అర్ధరాత్రికి 22 బార్లకు 24 దరఖాస్తులు, మూడు కల్లుగీత కార్మికుల బార్లకు 19 దరఖాస్తులు వచ్చాయి. కూటమి మద్యం సిండికేట్ కావాలనే ఓపెన్ కేటగిరిలో కేవలం ఆరు బార్లకు మాత్రమే దరఖాస్తులు వేయించింది. కల్లుగీత కార్మికులు సైతం సిండికేట్‌గానే దరఖాస్తులు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. లాటరీలో ఎవరికి బారు తగిలినా సిండికేట్‌గా నడుపుకొనేలా ముందస్తుగానే అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
లాటరీ విజేతలు వీరే..
జిల్లాలోని బార్లుకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో రాజమహేంద్రవరంలో గొర్రెల దుర్గాప్రసాద్, సానబోయిన సురేష్, మేకా మురళీకృష్ణ, మద్దుల జగదీశ్వర వేణుగోపాల అప్పారావు, ఆకుల శ్యామ్‌బాబు, నిడదవోలులో మన్యం పాండురంగప్రసాద్ లాటరీలో దక్కించుకున్నారు. కల్లుగీత కార్మికుల కేటగిరిలో రాజమహేంద్రవరంలో బారను సానబోయిన సత్యనారాయణ, కొవ్వూరు బారును వీరవల్లి వెంకట సత్యనారాయణ, నిడదవోలు బారను పాలా మణి కిరణ్ దక్కించుకున్నారు.
16 బార్లకు మళ్లీ నోటిఫికేషన్
జిల్లాలో ఓపెన్ కేటగిరిలో దరఖాస్తులు రాని
రాజమహేంద్రవరంలోని 13, కొవ్వూరు, నిడదవోలు, కడియపులంకలోకి ఒక్కో బారుకు ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మద్యం వ్యాపారులు మాత్రం ఈ సారైనా ప్రభుత్వం లైసెన్సు ఫీజు తగ్గిస్తుందని, నిబంధనలను మార్పు చేస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.

కూటమికే కిక్కు..