
గాయకుడు ఎస్పీ బాలు సేవలు మరువలేనివి
ధవళేశ్వరం: సంగీత ప్రపంచానికి గాయకుడు ఎస్పీ బా ల సుబ్రహ్మణ్యం చేసిన సేవలు మరువలేనివని సినీ నటుడు శుభలేఖ సుధాకర్, గాయని ఎస్పీ శైలజ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న ఘంటసాల విగ్రహం పక్కనే గోదావరి కల్చరల్ అసోసియేషన్, రాకా సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని శనివారం సాయంత్రం వారు ఆవిష్కరించారు. తొలుత కాటన్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న సాయిబాబా ఆలయంలో శుభలేఖ సుధాకర్, ఎస్పీ శైలజ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం రివర్ బండ్ వద్ద ఎస్పీ బాల సుబ్రహ్యణ్యం విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. విగ్రహ దాత గాలి సుబ్బరాజు, విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన ఇరిగేషన్ ఎస్‌ఈ గోపీనాథ్‌లను అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాకా కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవి రమణ, కార్యాధ్యక్షుడు యర్రమోతు ధర్మరాజు, ఉపాధ్యక్షుడు జీవీఆర్ జగన్నాథం పాల్గొన్నారు.