భక్తుల పాలిట భయంతులు! | - | Sakshi
Sakshi News home page

భక్తుల పాలిట భయంతులు!

Aug 6 2025 6:28 AM | Updated on Aug 6 2025 6:28 AM

భక్తు

భక్తుల పాలిట భయంతులు!

భక్తి ముసుగులో భారీగా దోపిడీ

శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి సుదూ ర ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీపాద వల్లభ ఆలయానికి వస్తుంటారు. ఆలయా నికి వచ్చే భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు నివాస గృహాలను అద్దె గృహాలు (లాడ్జిలు)గా మార్చివేసి భారీగా అద్దెలు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం పక్కకు వాలిపోయి కూలిపోయే స్థితికి చేరడంతో ఆ భవనం పక్కనే ఉన్న మరో భవన యజమాని అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో అధికారులు పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారని, ప్రస్తుత భవనం పక్కకు వాలిపోయినట్లు గుర్తించామని, ఆ భవనం పడిపోతే ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మూడవ అంతస్తును తొలగించి, భవన నిర్మాణ పటిష్టత విషయమై కాకినాడ జేఎన్టీయూ నుంచి నిర్మాణ పటిష్టత ధ్రువీకరణ పత్రాన్ని 15 రోజుల్లోగా అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. కానీ అధికారుల నోటీసులు పట్టించుకోకుండా ఇక్కడ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సలహా మేరకు కేవలం పై అంతస్తులు మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రమాదం పునాదులపై కట్టడాలు

ఇరుకు సందుల్లో బహుళ అంతస్తుల భవనాలు

ఆటో కూడా వెళ్లలేని చోట అతి పెద్ద

భవంతుల నిర్మాణం

ఫైర్‌ ఇంజిన్‌, అంబులెన్సు కూడా వెళ్లలేని పరిస్థితి

నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అనుమతులు

పిఠాపురం: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది అంతస్తుల భవనాలు. 50కి పైగా గదులు. ఒకేసారి 250 నుంచి 300 మంది వరకు ఒకే భవనంలో నివసించే విధంగా నిర్మాణాలు. కాన్నీ భవనం చుట్టూ నిలబడడానికి కూడా స్థలాలు కరవు. నిబంధనలను తుంగలో తొక్కి అవినీతి అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చిన అనుమతులతో పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కనీసం ఆటో కూడా వెళ్లడానికి వీలు లేని ఇరుకు సందుల్లో అతి పెద్ద భవనాలు నిర్మించేశారు. దీంతో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే అంబులెన్సు గాని ఫైర్‌ ఇంజిన్‌ గాని వెళ్లలేని పరిస్థితి ఉన్నా ఏ ఒక్క అధికారి ఇటు వైపు చూడకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయాందోళనల నడుమ ఉంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అవినీతితో అనుమతులు

అత్యంత ప్రసిద్ధిగాంచిన పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడం, అక్రమార్కులకు మున్సిపాలిటీలోని టౌన్‌ ప్లానింగ్‌లో గతంలో పని చేసిన ఒక అధికారి సహకరించడం భక్తులకు శాపంగా మారింది. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం గతంలో నిర్మాణంలో ఉండగానే పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల వ్యవహారంతో బయటపడింది. పిఠాపురం మున్సిపల్‌ పరిధిలో కేవలం జి ప్లస్‌ టు భవనాలను మాత్రమే నిర్మించాల్సి ఉంది. అంతకుమించి మరొక అంతస్తు నిర్మించాలంటే అనేక రకాల అనుమతి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ అవి ఏమీ లేకుండా అనుమతి పత్రాలకు బదులు శ్రీనోట్ల పత్రాల్ఙు సమర్పిస్తే నిబంధనలతో పని లేకుండా ఎన్ని అంతస్తులైనా ఎంచక్కా నిర్మించుకోవచ్చన్నది బహిరంగ రహస్యంగా మారింది. పిఠాపురం శ్రీపాద వల్లభ ఆలయం చుట్టుపక్కల కనీసం ఆటో కూడా వెళ్లలేని ఇరుకు వీధులలో ఐదంతస్తుల భవనాలను సైతం అవలీలగా నిర్మించడం వెనక భారీ ఎత్తున సొమ్ము చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో అవి ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదం జరిగితే అంతే సంగతి

ఇరుకు సందులు చిన్న వీధుల్లో ఇష్టారాజ్యంగా నిర్మించిన పెద్ద భవనాల్లో ఏ ప్రమాదం జరిగినా ఒక్కరు కూడా తప్పించుకునే పరిస్థితి కనిపించదు. క్షతగాత్రులను తరలించడానికి కనీసం అంబులెన్సు కూడా వెళ్లలేని అత్యంత ప్రమాదకర పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏ భవనానికి అనుమతి ఇవ్వాలన్నా సేప్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. అక్కడ నివాసాలకు తగ్గట్టుగా పార్కింగ్‌ స్థలం ఉండాలి. కాని ఇక్కడ ఏ భవనం చూసినా గదులు పదుల సంఖ్యలో ఉంటే ఒక్క కారు కూడా పెట్టుకునే వీలు ఉండదు. శాశ్వత నివాసాలు కాకపోవడంతో యాత్రీకులు కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్లి పోతుండడంతో పార్కింగ్‌ వేరే చోట పెట్టి భవనాలను లాడ్జిలుగా ఉపయోగిస్తు రూ.లక్షల్లో దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లానింగ్‌ విభాగపు అధికారుల చేతివాటం పట్టణ పరిధిలోని మరిన్ని భవనాల బహుళ అంతస్తులను పరిశీలిస్తే అవగతమవుతుంది. ఎవరు ఎలా పోతే మాకేంటి మా చేయి తడుస్తుంది అన్న రీతిలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుకోని సంఘటన జరిగినా ఫైర్‌ ఇంజిన్‌, పోలీస్‌, ఇతర శాఖల అధికారులు ప్రవేశించలేని ఇరుకు వీధులలో అక్రమ భవనాలకు లభించిన అనుమతులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కొంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలు పాటించని వారిపై చర్యలు

పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో నిబంధనలు పాటించకుండా చేపట్టిన నిర్మాణలపై దృష్టి సారిస్తున్నాం. అటువంటి భవనాలపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం. – ఎస్‌.వల్లీప్రియ, పట్టణ ప్రణాళికా విభాగం అధికారిణి, పిఠాపురం మున్సిపాలిటీ

భక్తుల పాలిట భయంతులు! 1
1/1

భక్తుల పాలిట భయంతులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement