
ఎండమావుల్లో కష్టజీవులు
రాజమహేంద్రవరం రూరల్/సీతానగరం: చాలీచాలని జీతాలతో పని చేస్తూ.. ఓ నెల జీతం రాకపోతే అల్లాడిపోయే ఈ రోజుల్లో.. శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కాంట్రాక్టు ఉద్యోగులకు ఏకంగా 20 నెలలుగా వేతనాలు రాక వారి కుటుంబాలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ స్వయానా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఆధీనంలోనే ఉంది. అయినప్పటికీ ఆ చిరుద్యోగులపై మాత్రం ఎవరూ కనికరం చూపడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి.
సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో 2006లో శ్రీసత్యసాయి చారిటబుల్ ట్రస్టు శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లోని గోకవరం, సీతానగరం, కోరుకొండ, రాజానగరం, దేవీపట్నం మండలాల్లోని 85 గ్రామాల ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేలా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ స్వీకరించింది. ఈ ప్రాజెక్టును టెండర్ ద్వారా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ ప్రతి నెలా కార్మికులకు జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో 53 మంది కార్మికులు కాంట్రాక్టు పద్ధతిపై నెలకు రూ.15 వేల జీతానికి పనిచేస్తున్నారు. ఆ చిరుద్యోగులకు ప్రతి నెలా వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు, అనారోగ్యం కలిగితే ఆస్పత్రిలో చూపించుకునేందుకు కనీసం ఈఎస్‌ఐ, పీఎఫ్‌కు కట్టాల్సిన సొమ్మునూ చెల్లించడం లేదు. ఇప్పటి వరకు 20 నెలల వేతనాల బకాయితో పాటు, 26 నెలలు పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లించాల్సి ఉంది. పెండింగ్ జీతాలు ఇవ్వాలని గతేడాది అక్టోబర్ 17, 18 తేదీల్లో సమ్మె చేపట్టగా, ఆ సమయంలో కాంట్రాక్టర్ రూ.50 వేల చొప్పున అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఈ ఏడాది మార్చి 17వ తేదీన లాలాచెరువులోని ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద సమ్మె బాట పట్టారు. స్వయంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలిసి కార్మికులతో చర్చించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో చర్చించి, వారి వేతనాల బకాయిలు ఇప్పిస్తామని నమ్మించారు. దీంతో కార్మికులు అప్పడు సమ్మె విరమించారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే బలరామకృష్ణ కలిసి రూ.20 లక్షల చెక్కును కాంట్రాక్టర్ పేరున ఇవ్వగా, కార్మికులకు రెండు నెలలు వేతనాలు చెల్లించారు. అప్పటి నుంచి మరలా ఆ ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ కార్మికులు వేతన బకాయిలను పట్టించుకోలేదు. దీంతో చేసేది లేక గత నెల 8వ తేదీ నుంచి లాలాచెరువు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద కార్మికులు మరలా సమ్మెబాట పట్టారు. కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాల వారు, ఆయా గ్రామాల ప్రజలు సైతం మద్దతుగా నిలిచారు. కూటమి ప్రభుత్వ పెద్దల్లోనూ, అధికారుల్లోనూ ఎటువంటి చలనం లేదు. బిల్లులు పెట్టాం.. వచ్చేస్తాయంటున్నారే మినహా తమ ఆకలిబాధలు పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
85 గ్రామాలకు నిలిచిన సరఫరా
శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కార్మికులు సమ్మె చేపట్టడంతో 85 గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరా నిలిచిపోయింది. రాజానగరం, సీతానగరం, కోరుకొండ, జగ్గంపేట, దేవీపట్నం మండలాల్లోని గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు మంచినీటి కోసం డిమాండ్ చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం కలగడం లేదు.
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
డిప్యూటీ సీఎం కనికరం
చూపాలంటున్న చిరుద్యోగులు
శ్రీసత్యసాయి డ్రింకింగ్
ప్రాజెక్టు కార్మికుల ఆకలికేకలు
20 నెలలుగా అందని వేతనాలు
గతంలో సమ్మె చేస్తే, రెండు నెలలు
ఇచ్చి చేతులు దులుపుకొన్న
కూటమి ప్రభుత్వం
85 గ్రామాలకు నిలిచిన
సురక్షిత నీటి సరఫరా
వారు చెమట చిందిస్తేనే ఎన్నో గ్రామాలకు గొంతు తడుస్తుంది. కడుపు నిండక పస్తులున్నా.. కాయకష్టానికి ఏనాడూ వెనుకంజ వేయలేదు. తీరా నెలల తరబడి వేతనాలందక.. తమ కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో తుదకు రోడ్డెక్కారు. అదిగో.. ఇదిగో అంటూ కూటమి సర్కార్ కాలయాపన చేస్తోంది మినహా.. వారి సమస్యకు ఓ పరిష్కారం చూపడం లేదు. శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుల దీనగాథ ఇది.
వేతనాల్లేక పస్తులు
గత 20 నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులకు విన్నవించినా బిల్లులు పెట్టామని చెబుతున్నారు కానీ, వేతన బకాయిలు మాత్రం రావడం లేదు. 30 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం.
– ఉందుర్తి ఇస్సాక్, జనరల్ సెక్రటరీ,
శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు వర్కర్స్ యూనియన్
ఉద్యోగ భద్రత కల్పించాలి
పెండింగ్‌లో ఉన్న 20 నెలలు జీతాలు, 26 నెలలుగా కట్టని ఈఎస్‌ఐ, పీఎఫ్‌లను వెంటనే చెల్లించాలి. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నాం. ప్రాజెక్టులో పనిచేసే కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించాలి. ఇప్పటికై నా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మాపై కనికరం చూపాలి.
– పి.శ్రీను, అధ్యక్షుడు,
శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు వర్కర్స్ యూనియన్

ఎండమావుల్లో కష్టజీవులు

ఎండమావుల్లో కష్టజీవులు

ఎండమావుల్లో కష్టజీవులు