వైద్యం.. పూజ్యం | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. పూజ్యం

Aug 7 2025 8:02 AM | Updated on Aug 7 2025 9:12 AM

వైద్య

వైద్యం.. పూజ్యం

అన్నవరం: నిత్యం మంత్రోచ్ఛారణలతో మార్మోగిన సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల మూగబోయింది. ఇక్కడి విద్యార్థులు అనారోగ్యం బారిన పడడం, దేవస్థానం వైద్యశాలలో వైద్యుడు లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది.. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన మధ్య పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది.. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, రూ.175 కోట్ల వార్షిక ఆదాయం ఉన్న అన్నవరం దేవస్థానం అధికారులు సరైన వైద్యం అందించలేక విద్యార్థులను ఇంటికి పంపిచేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దేవస్థానం వైద్యశాలలో నెల రోజులుగా వైద్యుడు లేకపోయినా ఎవరూ పట్టించుకోకపోవడం సమస్యకు కారణమైంది.

గతమెంతో ఘనం

అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాలను వ్రత మండపాల వద్ద చిన్న భవనంలో సుమారు ఐదేళ్లు నిర్వహించారు. ఆ తరువాత సత్యగిరిపై పదెకరాల విశాల ప్రాంగణంలో రూ. 4 కోట్లతో పాఠశాల నిర్మించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో 2022 ఆగస్టు 13న శ్రీసత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల కొత్త భవనాలు ప్రారంభమయ్యాయి. అప్పటి ఉప ముఖ్యమంత్రి, దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ పాఠశాలను ప్రారంభించారు. ఐదేళ్లు చదువు పూర్తి చేసిన విద్యార్థులకు ఉత్తీర్ణతా పత్రాలను ఆయన అందజేశారు. ఈ పాఠశాలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు దేవస్థానంలో పరిచారకులు, అర్చకులు, వ్రత పురోహితులుగా నియమిస్తామని కూడా ప్రకటించారు.

ఇప్పుడు అస్తవ్యస్తం

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఈ స్మార్త పాఠశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అనుభవం లేని అధికారులకు నిర్లక్ష్యం కూడా తోడైంది. గతేడాది విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే రత్నగిరిపై ప్రత్యేక క్యాంప్‌ నిర్వహించి వైద్యం అందించారు. అటువంటి ప్రయత్నం ఈసారి చేయలేదు. విద్యార్థులకు అనారోగ్యం సాకుతో సత్యగిరిపై నాలుగేళ్లుగా నిర్వహిస్తున్న సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించారు. ఎనిమిది మంది విద్యార్థులు గత గురువారం తీవ్ర అస్వస్థతతో తుని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందడం, వారిని దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌తో సహా పలువురు ప్రముఖులు పరామర్శించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరో ముగ్గురిని జ్వరం కారణంగా తుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్యం కుదుటపడడంతో శుక్రవారం డిశ్చార్జి చేశారు. గత శనివారం మరో నలుగురికి తీవ్ర జ్వరం రావడంతో దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాంతో పాటు మరి కొంతమంది విద్యార్థులకు జ్వరంగా ఉండడంతో అందరికీ రక్తపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆగమ పాఠశాలకు సెలవు ఇచ్చి విద్యార్థులను వారి ఇళ్లకు పంపించేశారు.

అస్తవ్యస్తంగా

స్మార్త ఆగమ పాఠశాల నిర్వహణ

విద్యార్థులకు కనీస వైద్యం కరవు

వైద్యుడు లేక వచ్చిన దుస్థితి

తల్లిదండ్రుల ఆందోళనతో సెలవు ఇచ్చాం

సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తామని చెప్పడంతో సెలవు ఇచ్చాం. దేవస్థానం వైద్యశాలలో వైద్యుడిని నియమించేందుకు డీఎంహెచ్‌ఓకు లేఖ రాశాం. వారు వైద్యుడిని నియమిస్తే నిబంధనలను అనుసరించి జీతభత్యాలు చెల్లిస్తాం. అంతవరకూ తాత్కాలికంగా వైద్యుడిని ఆసుపత్రిలో కనీసం ఉదయమైనా పనిచేసేలా నియమించాలని కలెక్టర్‌ను కోరతాం.

–వి.సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం

వైద్యాధికారి లేక..

దేవస్థానం ఆసుపత్రిలో వైద్యాధికారిగా పనిచేసిన శ్రీకాంత్‌కు రౌతులపూడి పీహెచ్‌సీలో వైద్యాధికారిగా ఉద్యోగం రావడంతో నెల రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారు. వెంటనే ఆయనను ఈఓ రిలీవ్‌ చేశారు. కొత్త వైద్యుడిని డీఎంహెచ్‌ఓ నియమించాల్సి ఉంది. ఆ వైద్యునికి జీతభత్యాలు దేవస్థానం చెల్లిస్తుంది. కొత్త వైద్యుడి నియామకం అయ్యేవరకూ తాత్కాలికంగా దగ్గరలోని పీహెచ్‌సీ నుంచి డాక్టర్‌ వచ్చి విధులు నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. కానీ అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోక ఇటు ఆగమ పాఠశాల విద్యార్థులే కాకుండా, దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేవస్థానం ఆసుపత్రిలో ఉన్న ఫార్మసీ సూపర్‌వైజర్‌, ఇతర సిబ్బంది వారికి తెలిసిన వైద్యం చేస్తున్నారు. తక్షణం దేవస్థానం వైద్యశాలలో వైద్యాధికారిని నియమించాలి. కనీసం వారానికి ఒకసారి డీఎంహెచ్‌ఓ లేదా ఇతర పీహెచ్‌సీ వైద్యులు ఆగమ పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

వైద్యం.. పూజ్యం 1
1/2

వైద్యం.. పూజ్యం

వైద్యం.. పూజ్యం 2
2/2

వైద్యం.. పూజ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement