
దళిత ఎమ్మెల్యే నియోజకవర్గంలో దళితులకు రక్షణ కరవు
దేవరపల్లి: ఓ దళిత ఎమ్మెల్యే ఉన్న గోపాలపురం నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదని రాష్ట్ర మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. నల్లజర్ల మండలం దూబచర్లలో వైఎస్సార్ సీపీ కార్యకర్త దొబ్బిడి పెద్దిరాజు బడ్డీకొట్టును తొలగించాలంటూ పంచాయతీ కార్యదర్శి ఆశా అలేఖ్యతో టీడీపీ నాయకులు ఒత్తిడి తెచ్చి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. బడ్డీ కొట్టు తమ జీవనాధారమని పెద్దిరాజు టీడీపీ నేతలను ప్రాధేయపపడినా విడిచిపెట్టలేదన్నారు. పోలీస్ స్టేషన్‌కు పెద్ధిరాజును, అతని భార్యను పిలిపించి భయపెట్టి బడ్డీకొట్టును తొలగించాలని చూశారని తెలిపారు. టీడీపీ నాయకులు, పంచాయతీ కార్యదర్శి వేధింపులను భరించలేక పెద్దిరాజు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పారు. పోలీసులు, అధికారులు అక్కడే ఉన్నప్పటికీ, కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లలేదని విమర్శించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల, ఏలూరు ఆస్పత్రుల్లో వారం రోజులు మృత్యువుతో పోరాడిన పెద్దిరాజు బుధవారం మృతి చెందినట్టు ఆమె తెలిపారు. ఇప్పటి వరకు పోస్ట్‌మార్టం జరగనివ్వకుండా అడ్డుకున్నారని, కార్యకర్త ఇంటికి వెళదామన్నా 144 సెక్షన్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన చెందారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఏం సమాధానం చెబుతారని ఆమె ప్రశ్నించారు.
జగన్ విమర్శించే స్థాయి ఎమ్మెల్యేకు లేదు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుకు లేదని వనిత అన్నారు. చంద్రబాబు మాజీ ఖైదీ కాదా? అని ప్రశ్నించారు. అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదనేది గుర్తుంచుకోవాలన్నారు. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై టీడీపీ నాయకులు చేసిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు.
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకే భద్రత లేకుంటే, సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పులివెందులలో జెడ్పీటీసీ స్థానంలో ఓటమి చెందితే ప్రజల్లో వ్యతిరేకత బయటపడి వైఎస్సార్ సీపీ బలపడుతుందని దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ పర్యటనలను తలుచుకుని కూటమి నేతలు భయపడుతున్నారన్నారు. పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, మహిళా విభాగం అధ్యక్షులు వై.లక్ష్మి పాల్గొన్నారు.
మాజీ హోం మంత్రి తానేటి వనిత