
కుతుకులూరులో గుడిసెల కూల్చివేత
బడుగులపై గొరిల్లా తరహా దాడులా :
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి
అనపర్తి : నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి ఆస్తులను గృహాలను నేలమట్టం చేసి పైశాచికానందం పొందుతున్నారని మండలంలోని కుతుకులూరు ఎస్సీపేట నిర్వాసితులు వాపోతున్నారు. అనపర్తి మండలం కుతుకులూరు ఎస్సీ పేటలో నివసిస్తున్న పదిమందికి చెందిన గుడిసెలను సోమవారం మధ్యాహ్నం భారీగా పోలీసులను మోహరించి జేసీబీలతో కూల్చివేశారని వారు చెప్పారు. ఈ ఘటనపై బాధితులు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్నామని, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో గుడిసెలను, పశువుల పాకలను వేసుకున్నామన్నారు. సోమవారం మధ్యాహ్నం పోలీసులు వచ్చి చెప్పా పెట్టకుండా అప్పటికప్పుడు జేసీబీలతో గుడిసెలను, పశువుల పాకలను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవత్వం చూపకుండా తొలగించి తమను కావాలనే ఇబ్బందుల పాలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ సానుభూతిపరుల పక్కా భవనాల వైపు కనీసం కన్నెత్తి చూడలేదన్నారు. మారుమూల ఉండే ఆ ప్రదేశంలో విగ్రహాలు పెడతామని అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేద బాతుకులపై గెరిల్లా దాడులా
విషయం తెలుసుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మంగళవారం బాధితులను పరామర్శించారు. జరిగిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏదో ఒక మూల పేదలపై విరుచుకుపడి వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయడం పరిపాటిగా మారిందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో అయితే మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో నిస్సహాయులైన బడుగుల జీవితాలపై గొరిల్లా తరహా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి సమయాల్లోను, తెల్లవారుజామున, సెలవు రోజుల్లోను వందలాది మంది పోలీసులను మోహరించి వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వాటిలో దోమాడ తరహా అర్థిక పరమైన లాభాపేక్షతో చేసేవి కొన్నైతే బిక్కవోలు, కొమరిపాలెం, పందలపాక తదితర చోట్ల చేసినట్టు కక్షపూరితంగా కొన్ని చేస్తున్నారని ఆరోపించారు. దోమాడలో నిరుపేదల, కుతుకులూరులోని మారుమూల ఎస్సీపేటలో ప్రాణమున్న మనుషులను జీవచ్చవాలుగా మార్చి జీవం లేని విగ్రహాలు పెడతామని వింత వాదనను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ కూల్చివేతల్లో పోలీసులతో పాటు మహిళా విభాగం నాయకురాలు కూడా ఉండి వారిని ప్రోత్సహిస్తున్నారంటే వారి రాక్షస మనస్తత్వం బయటపడుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు పద్దతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తథ్యం అని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగిరెడ్డి ఉన్నారు.

కుతుకులూరులో గుడిసెల కూల్చివేత