
వెదుళ్లపల్లి సొసైటీకి తాళం
● రుణాలు చెల్లించిన రైతుల ఆగ్రహం
● తమకు పాస్‌బుక్‌లు ఇవ్వాలని డిమాండ్
● సస్పెండైన సీఈవో లెటర్‌తో చైర్‌పర్సన్ ఎంపికపై అభ్యంతరం
సీతానగరం: సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్‌తో చైర్ పర్సన్ పదవి ఇవ్వడమేంటని, రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ను బ్యాంక్ నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు వెదుళ్లపల్లి పీఏసీఎస్‌కు మంగళవారం తాళం వేశారు. వివరాల్లోకి వెళ్లితే పీఏసీఎస్‌లో రూ.64 లక్షలు గల్లంతయ్యాయని సాక్షి దినపత్రిక గత ఏడాది వెల్లడించింది. దాంతో సీఈవో సురేంద్ర, ఎరువుల సేల్స్ వుమెన్ భారతి, గుమస్తా పోశియ్యలను సస్పెండ్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించినా తప్పుడు రసీదులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు విచారణ పేరుతో అందించకుండా నిలిపివేశారు. తాజాగా పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఏర్పాటుపై రైతులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని ఓవర్ డ్యూలో ఉన్న కవల శ్రీనివాస్‌రావుకు సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్ ఇచ్చారని, అందులో శ్రీనివాస్ చెల్లించిన రుణ నగదు తానే వాడుకున్నానని, దానిని చెల్లిస్తానని లెటర్ ఇవ్వడంతో చైర్ పర్సన్ పదవి ఇవ్వడానికి విచారణాధికారి శివరామకృష్ణ సిద్ధపడ్డారని రైతులు మరిపిండి సోమరాజు, ఎ రుఘురామ్, మద్దుకూరి సత్యనారాయణ, బొల్లి సత్యనారాయణ, సానపల్లి సత్యనారాయణ, కొత్తపల్లి దోసాలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండైన సీఈవో తాము చెల్లించిన రుణాలకు ఇదే విదంగా లెటర్ ఇస్తానని విచారణాధికారుల ఎదుట చెప్పాడని, లెటర్ తీసుకుని మా పట్టాదారు పాస్‌బుక్‌లు బ్యాంక్ నుంచి తమకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం తేలే వరకు సొసైటీ తాళం తీయబోమని హెచ్చరించారు. రుణాలు చెల్లించిన రైతులకు న్యాయం చేయకుండా రుణాలు ఓవర్ డ్యూ అయిన వారికి లెటర్ ఆధారంగా సొసైటి చైర్ పర్సన్ పదవి ఇవ్వడం తగదని రైతులు అన్నారు.

వెదుళ్లపల్లి సొసైటీకి తాళం