
ఉద్యోగులూ ఐక్యంగా ముందుకు సాగుదాం
రామచంద్రపురం: రాష్ట్రంలో ప్రభుత్వం, కాంట్రాక్టు, ఔట్‌ర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు 13 లక్షల మంది ఉన్నారని వీరందరికీ 25 వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ ఆరోపించారు. ఉద్యోగుల హక్కులు బాధ్యతలు తెలియజేసేందుకు, వారిని పోరాటంలో కార్యోన్ముకులను చేసేందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామ సూర్యనారాయణ పిలుపు మేరకు ఉద్యోగులను ఐక్యం చేసేందుకు ఉద్యోగులారా రండి.!.. టీ... తాగుతూ... మాట్లాడకుందాం.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాపూజీ అన్నారు. అందులో భాగంగా రామచంద్రపురం తాలూకా కమిటీ అధ్యక్షుడు జి. శ్రీ మన్నారాయణ అధ్యక్షతన పట్టణంలో ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాపూజీ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ నాలుగు డీఏలు, బకాయిలు ఉన్నాయని, ఐఆర్ ప్రకటించలేదని, సరండర్ లీవుల బకాయిలు చెల్లించడం లేదని, ఐదు సంవత్సరాలు దాటిన నేటికీ పీఆర్‌సీ ఏర్పాటు చేయలేదని బాపూజీ వాపోయారు. ఉద్యోగుల సమస్యలపై ఇతర సంఘాలు పోరాడటం లేదని, అందుకే ఏపీజీఏ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగులలో చొచ్చుకుపోయేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత చెల్లించాలో నిర్ధారించాలని, బకాయి డబ్బులు ఎంత ఇవ్వాలో ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ (ఎస్‌ఆర్)లో నమోదు చేయాలని, ఉద్యోగి కోరుకున్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే ఇండ్ల స్థలంగా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసోసియేట్ ప్రెసిడెంట్ కె.సుబ్బలక్ష్మి, కార్యదర్శి పైడిమల్ల సత్తిబాబు, పంపన విష్ణుమూర్తి, కరుణమ్మ, చీకట్ల వీరాంజనేయులు, సత్యవతి, దుర్గమ్మ, దుర్గ, శ్రీనివాస్, సత్తిబాబు పాల్గొన్నారు.