
కన్నుల పండువగా వెంకన్న పవిత్రోత్సవాలు
రెండోరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు కన్నుల పండువగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనము, ప్రోక్షణ, పవిత్ర ప్రతిష్ఠ ప్రధాన హోమాలు, అష్టకలశారాధన, మహాస్నపనము, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం స్వస్తివచనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.