
ఆటోను ఢీకొన్న కారు
విద్యార్థులు, డ్రైవర్ సహా 11 మందికి గాయాలు
తుని రూరల్: తుని మండలం హంసవరం సమీపంలో పాదాలమ్మతల్లి గుడి మలుపులో విద్యార్థులతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు సహా ఆటో డ్రైవర్, మరో ప్రయాణికురాలు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలియడంతో ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కె.కోటేశ్వరరావు, వి.గోపాలకృష్ణ, వరప్రసాద్, రమేష్‌బాబు, ఆశ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం మరువాడకు చెందిన విద్యార్థులు హంసవరంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌కు ఆటోలో వస్తున్నారు. మార్గం మధ్యలో మరో ప్రయాణికురాలిని డ్రైవర్ ఆటో ఎక్కించుకున్నాడు. హంసవరం పాదాలమ్మతల్లి గుడి వద్ద మలుపు తిరుగుతున్న ఆటోను వెనుక కారు ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. కారు సహా డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి మినహా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం విద్యార్థులను వారి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఆటోను ఢీకొన్న కారు