
బడి పంతుళ్లకు పస్తుల పాఠం
● పొజిషన్ ఐడీ రాక.. రెండు నెలలుగా మంజూరు కాని వేతనం
● బదిలీ అయిన ఉపాధ్యాయులకు
నేటికీ ఐడీల కేటాయింపు లేదు
● జీతాలకు ఎదురు చూస్తున్న టీచర్లు
● ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఒత్తిడిలో
1,500 మంది
ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు.
ఇప్పుడు కూటమి పాలనలో ఆ మాట నిజమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన బడి పంతుళ్లు కాలే కడుపుతో అలమటిస్తున్నారుు. పదోన్నతులు వచ్చాయని ఆనందపడాలో.. నెల జీతం చేతికందడం లేదని బాధ పడాలో తెలియని అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకటో తేదీ వస్తే కుటుంబ పోషణ, ఖర్చులు, అప్పులంటూ నెత్తిన గంపెడు కష్టాలు మోస్తూ కాలం వెళ్లదీస్తున్న వీరు.. సంపాదన ఆకస్మికంగా నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. చిన్న సాంకేతిక లోపాన్ని కూడా భూతద్దంతో చూపుతూ.. సర్కారు వీరిని కష్టాల కడలిలోకి నెట్టేసింది.
రాయవరం: జీతాలు రాగానే వేతన జీవులు ప్రతి నెలా ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, పాలు, కిరాణా తదితర ఖర్చులు చెల్లించాల్సి ఉండడం సర్వసాధారణం. ఏదైనా కారణంతో ఓ నెల ఆదాయం రాకుంటే ఎంత కష్టంగా ఉంటుందో వేతన జీవులకే ఎరుక. అటువంటిది రెండు నెలలుగా వేతనాలు రాకుంటే వారి పరిస్థితి ఏమిటో అవగతమవుతుంది. గత వేసవిలో బదిలీలు పొందిన పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించడంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనతో అనేక మంది ఉపాధ్యాయుల నెల జీతానికి బ్రేక్ పడింది. గత నెల వేతనాలు రాకపోగా, ఈ నెల కూడా అడియాశే ఎదురైంది. సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉపాధ్యాయ సంఘాల్లో వ్యక్తమవుతోంది. పొజిషన్ ఐడీలు కేటాయించి, తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేసిన విషయం పాఠకులకు విదితమే.
1,500 మందికి పైగా..
ఈ ఏడాది మే 21న ప్రారంభించిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జూన్ 15తో ముగిసింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పొందిన వారిలో పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. వాటిని సకాలంలో కేటాయించకపోవడంతో జూన్, జూలై వేతనాలను వారు నేటికీ పొందలేకపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి పైగా ఉపాధ్యాయులు ఇలా జీతభత్యాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం.
పొజిషన్ ఐడీ అంటే..
సాధారణంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సంబంధిత ఉపాధ్యాయుడి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. బదిలీ కాక పూర్వం వరకు వారు రెగ్యులర్‌గా జీతభత్యాలు పొందుతున్నప్పటికీ, ప్రస్తుతం బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అప్పుడే సంబంధిత ఉద్యోగి/ఉపాధ్యాయుడి వివరాలు సీఎఫ్‌ఎంఎస్‌లో డిస్‌ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే డీడీఓలో బిల్లు సమర్పించడానికి వీలవుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు నూతనంగా ఏర్పడడంతో, ఇక్కడ కొత్తగా కేటాయించిన పోస్టులకు పొజిషన్ ఐడీలు కేటాయించాలి. అప్పుడు ఆ స్థానాల్లో బదిలీపై వచ్చిన వారి జీతభత్యాలకు అవకాశం ఉంటుంది. బదిలీలు, పదోన్నతులు పూర్తయి రెండు నెలలు కావస్తున్నా.. నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలై, ఆగస్టులో తీసుకోవాల్సిన జూన్, జూలై నెలల వేతనాలు వారికి మంజూరు కాలేదు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీలోపు సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. గత నెల 25వ తేదీలోపు పొజిషన్ ఐడీలు రానందున రెండు నెలల వేతనాలను వీరు పొందలేకపోయారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో..
వేతనాలతో పాటు, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో పలు ఉపాధ్యా య సంఘాలు శనివారం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాయి. పలుమార్లు వినతిపత్రాలిచ్చినా పరిస్థితి లో మార్పు లేదని ఆయా సంఘాల నేతలు మండిప డ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పొజిషన్ ఐడీలకు చ ర్యలు తీసుకుని, రెండు నెలల వేతనాలను జూలై ఆరు న సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ చేసేలా జీవో జారీ చేసింది. ఈ జీవో ఎంతవరకు అమలవుతుంది, పొజిషన్ ఐడీలు సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ గడువు ముగిసే లోపు కేటాయిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.
ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్/ఒకేషనల్ ఉపా ధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది.
ప్రభుత్వ కక్షపూరిత ధోరణి
ఆన్‌లైన్ సమాచారం కావాల్సినప్పుడు ప్రభుత్వం ఆగమేఘాలపై సెకండ్ల వ్యవధిలో సమాచారం సేకరిస్తుంది. ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించి సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి రెండు నెలలు సాగదీశారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణి వీడి వెంటనే ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించి, వేతనాలను తక్షణమే చెల్లించాలి.
– పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
రెండు నెలలుగా ఇబ్బందులు
నెల వేతనం రాకుంటేనే వేతన జీవులు ఇబ్బందులు పడే పరిస్థితి. నిత్యావసర వస్తువులు, ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితుల్లో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీని అధికంగా వినియోగిస్తూ, క్షణాల్లో డేటా సేకరిస్తున్న ప్రభుత్వం.. పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. సప్లిమెంటరీ బిల్లులు ఈ నెల 15లోపు చేసుకునేలా చర్యలు చేపట్టాలి.
– పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు,
ఎస్‌టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ప్రణాళిక లోపం కన్పిస్తోంది
బదిలీలు, పదోన్నతుల సమయంలోనే పొజిషన్ ఐడీలు కేటాయించే చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రభుత్వ ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు నెలలుగా వేతనాలు రాక, బ్యాంకుల్లో ఈఎంఐలు చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వైద్య ఖర్చులకూ ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– దీపాటి సురేష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

బడి పంతుళ్లకు పస్తుల పాఠం

బడి పంతుళ్లకు పస్తుల పాఠం

బడి పంతుళ్లకు పస్తుల పాఠం