
పదవుల కోసం సిగపట్లు
సాక్షి, రాజమహేంద్రవరం: నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు చల్లారడం లేదు. ఇప్పటి వరకూ ఇసుక, మద్యం ఆదాయంలో వాటాల కోసం ముష్టియుద్ధాలకు దిగిన నేతలు.. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల కోసం సిగపట్లు పడుతున్నారు. కూటమి ధర్మాన్ని పాటించకుండా నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ నేతలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తూండటం, జనసేన నేతలను పక్కన పెడుతూండటంతో విభేదాల అగ్గి మరింతగా రాజుకుంటోంది. పార్టీని నమ్ముకున్న నేతలను కాదని టీడీపీ నేతలకు కట్టబెట్టడంపై జనసేన కేడర్‌లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. జనసేన నేతలకు టీడీపీ ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూండటం పరిపాటిగా మారుతోంది.
నామినేటెడ్ రగడ
నిడదవోలులో నామినేటెడ్ పోస్టుల భర్తీ జనసేన, టీడీపీ నేతల్లో విభేదాల మంట పుట్టిస్తోంది. నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ నేతలకే కట్టబెట్టేందుకు పావులు కదుపుతూండటంపై జనసేన నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
● నిడదవోలు నియోజకవర్గంలో పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జుల విషయంలో జనసేన, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గ్రామ స్థాయి నేతలు సైతం రెండు వర్గాలుగా విడిపోయారు. నిడదవోలు నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి ధర్మం ప్రకారం జనసేనకి 70 శాతం, టీడీపీకి 30 శాతం పదవులివ్వాలి. దానికి అనుగుణంగా భర్తీ చేయాలని జనసేన శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, నియోజకవర్గంలో తమకే మెజార్టీ ఉందని, 50 శాతం పైగా పదవులు తమకే కావాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావుపై ఆ పార్టీ నాయకులు ఒత్తిడి పెంచుతున్నారు. పదవుల పంపకాల్లో సయోధ్య కుదరకపోవడంతో పీఏసీఎస్‌ల పదవుల భర్తీ స్తంభించిపోయింది. ప్రత్యేక అధికారులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో, పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి చుక్కెదురైంది.
● నిడదవోలు మండలంలోని 12 సొసైటీ అధ్యక్ష పదవుల్లో 6 టీడీపీకి, 6 జనసేనకు ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఇరు పార్టీల నేతలూ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
‘సైకిల్’ దిగిపోయారు
● నిడదవోలు మండలం సింగవరంలో సొసైటీ పర్సన్ ఇన్‌చార్జ్ పదవిని జనసేనకు ఇస్తున్నారనే సమాచారం ముగ్గురు టీడీపీ నేతల్లో ఆగ్రహావేశాలు నింపింది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే.. పదవులు మాత్రం వారికిస్తారా అంటూ టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు పెన్మెత్స సత్యనారాయణ రాజు, సింగవరం నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు పెన్మెత్స ప్రవీణ్‌వర్మ, ఆ సంఘం మాజీ అధ్యక్షుడు పెన్మెత్స ఆంజనేయరాజులు టీడీపీకి గుడ్‌బై చెప్పారు.
● కాటకోటేశ్వరం సొసైటీ పర్సన్ ఇన్‌చార్జ్ పదవి జనసేనకు ఇస్తున్నారన్న సమాచారంతో గ్రామ టీడీపీ కార్యదర్శి ఈరిశెట్టి రాజగోపాలస్వామి, క్లస్టర్ ఇన్‌చార్జ్ తిరుమలశెట్టి బాబీ రాజీనామా చేశారు.
● నిడదవోలు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆశించి భంగపడిన టీడీపీ రాజమండ్రి పార్లమెంటరీ అధికార ప్రతినిధి, సమిశ్రగూడెం గ్రామానికి చెందిన బుగ్గే శివరామకృష్ణశాస్త్రి కూడా టీడీపీకి టాటా చెప్పేశారు.
తారస్థాయిలో విభేదాలు
నిడదవోలు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఇప్పటికే విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇటీవల గోపవరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు మంత్రి కందుల దుర్గేష్‌ను ఆహ్వానించలేదు. మాజీ ఎమ్మెల్యే శేషారావును మాత్రమే పిలిచారు. ఫ్లెక్సీల్లో సైతం దుర్గేష్ ఫొటో పెట్టలేదు. దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత చర్చ జరిగింది. మంత్రిని పిలవాలంటూ జనసేన నేతలు ప్రసార మాధ్యమాల్లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పదవుల పందేరం సైతం చర్చనీయాంశమవుతోంది. ఇదిలా ఉండగా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తమకు అనుకూలమైన పవనాలు వీస్తాయని, తమ పార్టీకి చెందిన పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అవుతారంటూ టీడీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. అప్పటి వరకూ పదవులపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోకూడదనే ఆలోచనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలిసింది.
నిడదవోలులో గ్లాస్,
సైకిల్ మధ్య విభేదాలు
ఇరు వర్గాలుగా విడిపోయిన నేతలు
కూటమిలో ప్రాధాన్యం లేదంటూ
జనసేన నేతల గుర్రు
నామినేటెడ్ పదవులన్నీ టీడీపీకే కట్టబెడుతున్నారని ఆగ్రహం
నిరసనగా పీఏసీఎస్ పదవుల భర్తీని అడ్డుకున్న టీడీపీ నేతలు
అన్ని నియోజకవర్గాల్లోనూ
పాలకవర్గాల నియామకం
ఇక్కడ మాత్రమే పెండింగ్
పడని ‘తొలి అడుగు’
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదైన సందర్భంగా టీడీపీ అధిష్టానం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ పేరిట ప్రజాప్రతినిధులు ఇంటింటికీ తిరిగి ప్రజల అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిడదవోలు నియోజకవర్గంలో మాత్రం ఈ కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి తూతూమంత్రంగా నాలుగిళ్లు తిరగడంతోనే సరిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. వెరసి ఈ కార్యక్రమం నిర్వహణలో నిడదవోలు జిల్లాలోనే చివరి స్థానంలో ఉన్నట్లు తెలిసింది.