
ఎరువులు పుష్కలంగా అందించాలి
● రైతులను ఆదుకోవాలి
● లేకుంటే పోరుబాట తప్పదు
● కలెక్టర్‌కు వైఎస్సార్ సీపీ నేతల వినతి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కూటమి పాలనలో అన్ని వర్గాల వారూ మోసపోయారని, ముఖ్యంగా రైతన్నలు దగా పడ్డారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. యూరియా కొరత కారణంగా అన్ని జిల్లాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ వద్ద రైతులతో కలసి సోమవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, సాగు అవసరాలకు అనుగుణంగా ఎరువులు పుష్కలంగా అందించాలని, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని, లేకుంటే పోరుబాట తప్పదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగడి సత్యప్రియ, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, జిల్లా కోశాధికారి వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా అధికారి ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, ఆచంట కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
దగా పడిన రైతన్నలు
మనది వ్యవసాయాధారిత రాష్ట్రం. జిల్లాలో ఎక్కువ శాతం మంది వ్యవసాయం చేస్తున్నారు. విత్తు నుంచి ఉత్పత్తి విక్రయం వరకూ ఒక క్రమ పద్ధతిలో విధానాలు తీసుకుని వచ్చిన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నేడు రైతులను, వ్యవసాయాన్ని చంద్రబాబు విధ్వంసం చేశారు. రైతులు యూరియా, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి వాటి గురించి అడగాల్సిన అగత్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా, గిట్టుబాటు ధర ఎత్తేశారు. రైతులు నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. రైతులను అన్నివిధాలా దెబ్బ తీస్తున్న కూటమి సర్కారు.. వారి ఉసురు పోసుకుంటోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీడు భూమిని కూడా సాగు భూమిగా చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం సాగు భూమిని బీడు భూమిగా మార్చేసింది. అబ్బిరెడ్డి పుల్లయ్య అనే రైతు ఎరువులు అడగడానికి వెళ్తే మూడు బస్తాలు ఇస్తారన్నారు. అవి సరిపోవని రైతు అడిగితే అధికారులు కొట్టినంత పని చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రశాంతి దృష్టికి తీసుకుని వెళ్లాం.
– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి

ఎరువులు పుష్కలంగా అందించాలి

ఎరువులు పుష్కలంగా అందించాలి