
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
కడియం: అండర్–14 డబుల్స్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలకు దాసరి నాగ వెంకట అర్జున్ (కడియం), ఎం.ప్రణీత్ (రాజమహేంద్రవరం) ఎంపికయ్యారు. కోచ్ నాగులకొండ వీరభద్రం సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇటీవల సికింద్రాబాద్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ ఐసీఎస్‌ఈ ఆంధ్రా – తెలంగాణ రీజినల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో అర్జున్, ప్రణీత్ మొదటి స్థానంలో నిలిచారు. తమిళనాడులో సెప్టెంబర్ 24, 25 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారు. అర్జున్‌కు అతడి తాతయ్య, నానమ్మ నాగభూషణం, సత్యకుమారి.. ప్రణీత్‌కు అతడి తల్లిదండ్రులు ఎం.దీప, చలపతి అభినందనలు తెలిపారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు
35 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్(పీజీఆర్‌ఎస్)కు 35 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదీల నుంచి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ స్వయంగా అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. సివిల్, చీటింగ్, కొట్లాట, దొంగతనం కేసులతో పాటు కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు.
‘నన్నయ’లో ఈడీసీ
ఏర్పాటు చేస్తాం
రాజానగరం: విద్యార్థులకు వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ – విద్యా సంబంధాలను పెంపొందించడంలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ సెంటర్ (ఈడీసీ) ఏర్పాటు చేస్తామని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఇండస్ట్రియల్ కన్సల్టెంట్ నందగోపాల్ సోమవారం వీసీతో సమావేశమై, వర్సిటీ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, యూనివర్సిటీకి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖ నుంచి ఉపయోగకరమైన కొన్ని ప్రాజెక్టులు వచ్చాయని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ ఏర్పాటు ద్వారా గోదావరి ప్రాంతంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వ్యవసాయ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో స్థానికులకు సాధికారత కల్పించడం ద్వారా గ్రామీణ వ్యాపార ఇంక్యుబేషన్ ఏర్పాటు అవసరంపై కూడా చర్చించారు. వర్సిటీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని నందగోపాల్ తెలిపారు. సమావేశంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అధికారి బి.జగన్‌మోహన్‌రెడ్డి, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి ఆచార్య ఉమామహేశ్వరిదేవి పాల్గొన్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక