
పీజీఆర్‌ఎస్‌కు 195 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 195 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 77, పంచాయతీరాజ్ 45, పోలీస్ 20, పాఠశాల విద్య 10, ఇతర శాఖలకు చెందినవి 43 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలన్నారు. ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాల ప్రదర్శన ఉండాలని ఆదేశించారు.
18 నుంచి ‘సామవేదం’
ప్రవచనాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సరస్వతీ గానసభ ఆధ్వర్యాన ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకూ సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. ‘సనాతన ధర్మం – శాశ్వత న్యాయం’ అనే అంశంపై స్థానిక సూర్య కళా మందిరంలో ఆయన ప్రవచనం చేస్తారని నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రవచనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.