
దారుణ మోసం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాయితీ రుణాలతో స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని కూటమి సర్కార్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు రుణాలిస్తామని, సగం సబ్సిడీ అని, మిగిలిన సగం బ్యాంక్ రుణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గొప్పగా డప్పేశారు. బీసీ, ఎస్సీ, కాపు సామాజికవర్గాలకు రుణాలో రుణాలంటూ దండోరా వేసి మరీ ప్రచారం చేశారు. మంత్రుల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి అందరికీ సబ్సిడీ రుణాలంటూ ఊదరగొట్టారు. మాయ మాటలతో జనాన్ని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కారు. తరువాత ఎప్పటి మాదిరిగానే నిలువునా ముంచేశారు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలు రాకపోవడంతో.. స్వయం ఉపాధి పొందవచ్చని ఆశపడిన వారు హతాశులవుతున్నారు. అంతన్నారింతన్నారే చంద్రబాబు.. నట్టేట్లో ముంచేశారే.. అని మండిపడుతున్నారు.
లక్ష్యం మూరెడు.. దరఖాస్తులు బారెడు
బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన వారికి రాయితీ రుణాలిస్తామని సర్కారు ఊరూవాడా ఊదరగొట్టింది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి రుణ లక్ష్యాలు వందల్లోనే ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో అన్ని కార్పొరేషన్లు కలిపి సుమారు 100 యూనిట్లు కేటాయిస్తే అంతకు పది రెట్లు దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం మార్చి 11న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించింది. ఆ నెలంతా స్వీకరించడంతో వేలాదిగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వాటిని ఏప్రిల్ నెలలో మండల స్థాయిలో వడబోసిన ఎంపీడీఓలు.. ఆయా బ్యాంకులకు పంపించారు. బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. బ్యాంకుల నుంచి ఆమోదం లభించిన వారంతా శ్రావణమాసం మంచి రోజుల్లో యూనిట్లు ప్రారంభిద్దామని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కానీ, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. మంజూరు చేసిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు ఎక్కడా లంగరు అందకపోవడంతో ప్రభుత్వం మార్జిన్ మనీ విడుదల చేయకుండానే కార్పొరేషన్ రుణ ప్రక్రియను అప్పటికప్పుడు నిలిపివేసింది. ఈ రుణాలపై ముందుకు వెళ్లవద్దని మే 8న ఆదేశాలిచ్చింది. ఫలితంగా కార్పొరేషన్ రుణాల ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క యూనిట్ కూడా ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. ఒక యూనిట్ విలువ రూ.2 లక్షలనుకుంటే అందులో 50 శాతం అంటే రూ.లక్ష ప్రభుత్వ సబ్సిడీ. మిగిలిన రూ.లక్ష బ్యాంకు రుణం. ఇస్తానన్న 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేయకుండా మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోంది. రుణాల పేరిట దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఎందుకు.. ఇప్పుడు తమ ఆశలను అడియాశలు చేయడం ఎందుకని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినా ప్రభుత్వం కావాలనే సబ్సిడీ విడుదల చేయకుండా చివరి నిమిషంలో అర్ధాంతరంగా ఈ ప్రక్రియను నిలిపివేసిందని మండిపడుతున్నారు.
పెద్దాపురంలో కార్పొరేషన్ రుణాల
ఇంటర్వ్యూలకు హాజరైన
అర్జీదారులు (ఫైల్)
మూడు జిల్లాల్లో ఆయా కార్పొరేషన్ల వారీగా రుణాల వివరాలు
రుణాల కేటగిరీ యూనిట్ల రుణాల లక్ష్యం దరఖాస్తు మంజూరు మొత్తం
లక్ష్యం (రూ.లక్షలు) దార్లు చేసిన (రూ.కోట్లు)
యూనిట్లు
కాకినాడ జిల్లా
బీసీ కార్పొరేషన్ 1,914 3,952.00 31,859 562 1,283.55
ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 2,449 41 84.42
కాపు కార్పొరేషన్ 763 2,824.00 21,454 238 5.93
తూర్పుగోదావరి జిల్లా
బీసీ కార్పొరేషన్ 1,374 2,887.00 16,408 234 5.22
ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 203 540.00 2,211 20 0.54
కాపు కార్పొరేషన్ 757 2,715.00 8,193 174 4.53
కోనసీమ జిల్లా
బీసీ కార్పొరేషన్ 1,394 2,954.00 15,147 246 5.87
ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 1,657 12 0.24
కాపు కార్పొరేషన్ 757 2,714.00 15,644 158 4.62
ఒక్క యూనిట్ అయినా ఇస్తే ఒట్టు!
ఊదరగొట్టి ఉసూరుమనిపించారు
మూడు నెలలైనా దిక్కూమొక్కూ లేదు
సబ్సిడీపై చేతులెత్తేసిన సర్కార్