కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి స్థానిక ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలురు, బాలికల హాస్టల్‌ను, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను మంగళవారం సందర్శించారు. హాస్టళ్లలో వసతులు, ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడారు. గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్‌లో వసతులు, శుభ్రత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ కిటికీలకు దోమ తెరలు లేవని, బాత్ రూములకు డోర్లు లేవని, భోజనం చేసే స్థలం శుభ్రంగా లేదని, భోజనం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని వెంటనే మెరుగు పరచాలని సూచించారు. విద్యార్థులకు సురక్షిత తాగునీరు, మంచి ఆహారం అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి చెప్పారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, న్యాయ సహాయం కావాలన్నా డీఎల్‌ఎస్‌ఏకి తెలియజేయాలని శ్రీలక్ష్మి సూచించారు.
స్మార్ట్ మీటర్లు రద్దు
చేసేంత వరకూ పోరాటం
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకువచ్చిన స్మార్ట్ మీటర్లను రద్దు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. ఆ పార్టీ జిల్లా మహాసభల పోస్టర్‌ను స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్రంలో నాలుగుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా సామాన్యుడిపై మరింత భారం పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు అరకొరగా ఉందని విమర్శించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారంటూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆ ప్రాజెక్ట్‌కు సమాధి కడుతున్నారని వనజ ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ఆగస్టు 6, 7 తేదీల్లో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 17 మండలాలకు చెందిన ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతారన్నారు.
ఇదేం భోజనం.. ఇవేం సౌకర్యాలు?
ఇదేం భోజనం.. ఇవేం సౌకర్యాలు?