
ఇవేం రోడ్లురా బాబూ!
గోపాలపురం: గోపాలపురం మండలంలో పలు రహదారులు ఛిద్రమయ్యాయి. గజానికో గొయ్యి అన్నట్టుగా మారడంతో ప్రయాణికులు నానా యాతనలూ పడుతున్నారు. సంక్రాంతి నాటికే రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూటమి సర్కారు గొప్పగా చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రోడ్ల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా వెచ్చించ లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న దాఖలాల్లేవని వాపోతున్నారు.
ఫ దేవరపల్లి – తల్లాడ జాతీయ రహదారిపై గోపాలపురం – కొయ్యలగూడెం మధ్య మాతంగమ్మ ఆలయం సమీపాన ఉన్న కల్వర్టుకు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. రాత్రి వేళల్లో వాహనదారులు ఆ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. గోతుల్లో పడిన భారీ వాహనాలు కమాన్ కట్టలు విరిగిపోయి రోజుల తరబడి రోడ్డు పక్కనే నిలిచిపోతున్నాయి.
ఫ గోపాలపురం – దేవరపల్లి పొగాకు బోర్డు సమీపాన రోడ్డు దెబ్బతింది. ఇక్కడ ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని రీతిలో మలుపులుండటంతో వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఫ గోపాలపురం – గుడ్డిగూడెం రోడ్డులో పిచ్చుక గండి సమీపాన పెద్ద గుంత పడింది.
ఫ గోపాలపురం – భీమోలు రోడ్డు కల్వర్టుకు ఇరువైపులా పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ఆ గోతులు కనిపించకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఫ ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిత్యం ప్రమాదాలు జరుగుతున్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇవేం రోడ్లురా బాబూ!

ఇవేం రోడ్లురా బాబూ!