
నిర్బంధంతో పోరాటాలు అణచలేరు
సాక్షి, రాజమహేంద్రవరం: నిర్బంధాలతో పోరాటాలను అణచలేరని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రా పేపరు మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. మిల్లు కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండుతో మంగళవారం నుంచి ఆయన చేపట్టాలనుకున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు సోమవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. రాజాను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్‌లోని తన నివాసం వద్ద రాజా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో చెప్పి, వారి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని, ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించానని, అయితే మిల్లు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాం. సమస్య పరిష్కారమపోతుందని కూటమి నేతలు చెప్పడంతో దీక్షను వాయిదా వేశానని వివరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, కానీ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న వారిని అణచివేస్తున్నారని అన్నారు. పేపరు మిల్లులో సుమారు 2,500 మంది కార్మికులున్నారని, వారి వేతన సవరణ, ఇతర సౌకర్యాల కల్పనలో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ విధానాలకు తావు లేదన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఇవే విధానాలను అవలంబిస్తే కూటమి నేతలను ప్రజలు బయట తిరగనివ్వబోరని చెప్పారు. పేపరు మిల్లు కార్మికుల సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి పోరాడతామని వెల్లడించారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. పేపరు మిల్లు యాజమాన్యం కొమ్ములు వంచైనా కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు.
అర్ధరాత్రి హౌస్ అరెస్టు
పేపరు మిల్లు కార్మికుల సమస్యలపై జక్కంపూడి రాజా తొమ్మిది రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారు. మిల్లు కార్మికులకు వేతన సవరణ చేయాలని, చట్టపరంగా అన్ని సౌకర్యాలూ కల్పించాలనే డిమాండ్లతో మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో రాజా ఉంటున్న కృష్ణసాయి కల్యాణ మండపం వద్దకు దాదాపు 150 మంది పోలీసులు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడ నానా హంగామా చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజాను ఆయన ఇంటికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించగా.. పేపరు మిల్లుకు 500 మీటర్ల దూరంలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదని చెప్పారు. రాజాతో పాటు మరో 50 మందిని ముందస్తుగా అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుచరులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, తెల్లవారుజామున ఇళ్లకు పంపడం దారుణమని మండిపడ్డారు.
వైఎస్సార్ సీపీ నేతల మద్దతు
పోలీసుల నిర్బంధంలో ఉన్న రాజాను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్‌చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, యువజన విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, కాకినాడ సిటీ అధ్యక్షుడు రోకళ్ల సత్య, నేతలు కర్రి పాపారాయుడు, రామలింగం, శ్రీనివాస్, దీపక్, స్థానిక నాయకులు గేడి అన్నపూర్ణరాజు, దుంగ సురేష్, ఆశోక్‌కుమార్ జైన్, పసుపులేటి కృష్ణతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలసి మద్దతు తెలిపారు.
ఫ పేపరు మిల్లు కార్మికులకు న్యాయం
జరిగే వరకూ ఉద్యమం ఆగదు
ఫ వైఎస్సార్ సీపీ నేత,
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
ఫ ఆమరణ దీక్షను అడ్డుకున్న పోలీసులు
ఫ అర్ధరాత్రి హంగామా.. హౌస్ అరెస్టు
ఫ రాజాకు పలువురి పరామర్శ

నిర్బంధంతో పోరాటాలు అణచలేరు