
స్వల్పంగా వచ్చే వరద మంచిదే!
ఐ.పోలవరం: గోదావరికి వరద అంటే ఎవరైనా భయపడతారు. మరీ ముఖ్యంగా కోనసీమ జిల్లావాసులకు నిద్రాహారాలు ఉండవు. ఉప్పెనలా వచ్చిపడే వరద లంక గ్రామాలను, పంట భూములను ముంచెత్తుతోంది. వందల మంది రైతులకు నష్టాలను మిగులుస్తోంది. వరదల వల్ల లంకవాసులు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే స్వల్పంగా వచ్చే వరదకు రైతులు, లంక గ్రామాల్లో ఉద్యాన పంటలు సాగు చేసేవారు, మత్స్యకారులు సంబర పడతారంటే అతిశయోక్తి కాదు. గోదావరికి వరద వచ్చి తగ్గుముఖం పట్టింది. అత్యధికంగా ఈ నెల 13వ తేదీన 7.29 లక్షల క్యూసెక్కుల వరద నీరు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేశారు. తరువాత నుంచి వరద క్రమేపీ తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో 1,76,676 క్యూసెక్కులకు తగ్గింది. వరద వచ్చి తగ్గుముఖం పట్టడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
మేలు చేసే ఒండ్రు మట్టి
గోదావరి వరదల సమయంలో ఎగువ నుంచి వచ్చే ఎర్రనీరుతోపాటు ఒండ్రుమట్టి కొట్టుకు వస్తుంది. ఇది కాలువల ద్వారా పంట చేలు, తోటలకు చేరుతుంది. ఎగువ కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే నీరు పలు రకాలుగా మంచిది. కొండల మీద పడే వర్షాల నుంచి వచ్చే నీటిలో మినరల్స్, న్యూట్రినైట్స్ ఉంటాయి. అటవీ ప్రాంతాల నుంచి వచ్చే నీటిలో కూడా వనమూలికలు, హ్యూమస్ (జంతు కళేబరాల అవశేషాల నుంచి వచ్చే కర్బనం), సూక్ష్మ పోషకాలు అధికం. పంట పొలాలు, తోటల్లో నీరు చేరిన తరువాత దానిలో ఉన్న ఒండ్రు అర అడుగు మేర భూమిపై పేరుకుపోతుంది. గోదావరి లంకల్లో అయితే అడుగు మేర ఒండ్రు మట్టి చేరుతుంది. డెల్టా కాలువల నుంచి చేలకు నేరుగా వరద వస్తుంది. గోదావరి నదీపాయల నుంచి విడిపోయే కౌశికలు, అప్పర కౌశికలు, తొగరపాయ, తుల్యభాగ వంటి డ్రెయిన్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కొబ్బరి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు, డెల్టాలో పంటలకు ఈ నీటిని పెద్ద ఎత్తున తోడడం ద్వారా రైతులు తమ చేలు, తోటలకు ప్రకృతి సిద్ధమైన సూక్ష్మ పోషకాలు, మినరల్స్, న్యూట్రినైట్స్ అందిస్తున్నారు.
పులసలొచ్చేది ఇప్పుడే
మాంసాహార ప్రియులకు నోరూరించే గోదావరి జలపుష్పం పులస చేప దొరికేది కూడా గోదావరికి ఎర్రనీరు వచ్చినప్పుడే. బంగ్లాదేశ్, కోల్‌కతా, ఒడిశా వంటి ప్రాంతాల్లో సముద్రంలో హిల్స్ (విలస) నిత్యం దొరుకుతుంది. ఇటీవల కాలంలో గోదావరి జిల్లాతోపాటు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా ఈ చేప దొరుకుతూనే ఉంటోంది. స్థానికంగా కూడా సముద్ర వేట సమయంలో విలసలు పెద్ద ఎత్తున దొరుకుతుంటాయి. కాని అసలైన పులస దొరికేది మాత్రం గోదావరికి ఎర్రనీరు తాకినప్పుడే. సాధారణ రోజుల్లో దొరికే విలస చేప కేజీ రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు మాత్రమే ఉంటుంది. అదే గోదావరికి ఎర్రనీరు తాకిన తరువాత దొరికే పులస ఖరీదు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ధర ఉంటుంది. అందుకే గోదావరికి ఎర్రనీరు తగిలి పులస దొరికితే చాలని మత్స్యకారులు ఎదురుతెన్నులు చూస్తున్నారు.
నీటికి ఎదురీదుతూ ఒక్కసారి గోదావరి నీటిలోకి వచ్చిన తరువాత దీని రుచి మారిపోతుంది. ఎర్రనీటిలో వీటిని పట్టుకోవడానికి మత్స్యకారులు పోటీ పడుతుంటారు. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, టాంజానియా వంటి ప్రాంతాల్లో జీవించే ఈ చేపలు సంతానోత్పత్తి కోసం ఖండాలు దాటి ప్రయాణిస్తాయి. హిందూ మహాసముద్రం మీదుగా బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడి నుంచి అంతర్వేది గుండా గోదావరి నది నీటిలోకి చేరతాయి. గోదావరి నది చాలా వేగంగా ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవాహాన్ని తట్టుకోవడమే కాకుండా దానికి ఎదురీదుకుంటూ రావడం పులస చేప ప్రత్యేకత. వీటి వలసలు జూన్ నుంచి ఆగస్టు మధ్య ఉంటాయి. గుడ్లు పెట్టి అవి పిల్లలు అయిన తర్వాత అక్టోబర్ మాసానికి చేపలన్నీ తిరిగి సముద్రంలోకి చేరుకుంటాయి. ఇలా గుడ్లను పొదగడానికి వచ్చిన సమయంలో మత్స్యకారుల వలలో పడతాయి ఈ చేపలు. వలలో పడిన వెంటనే పులస చనిపోతుంది. గోదావరి వరద నీటిలోకి వచ్చిన తరువాత దీని రంగు మారుతుంది. దాంతో పాటు గోదావరి తీపి నీటి కారణంగానే వాటి రుచి కూడా మారి పులసగా అవతరిస్తుంది. అయితే గోదావరి అంతటా పులసలు దొరుకుతాయని అనుకోవడం భ్రమే. కేవలం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి గోదావరి కలిసే ప్రాంతంలో మాత్రమే ఇవి లభిస్తాయి. వీటికి ఇంతటి డిమాండ్ ఉండటానికి ఇది కూడా కారణం.
పంట చేలు, లంక తోటలకు ఎర్ర నీరు
పొలాలు, ఉద్యానాలకు మేలు

స్వల్పంగా వచ్చే వరద మంచిదే!

స్వల్పంగా వచ్చే వరద మంచిదే!

స్వల్పంగా వచ్చే వరద మంచిదే!