
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
సీతానగరం: రఘుదేవపురం రవీంద్ర కాలనీ సురవరపు మణికంఠ ఇంటిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేశామని నార్త్‌జోన్ డీఎస్సీ వై శ్రీకాంత్ తెలిపారు. గురువారం సీతానగరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోరుకొండ సీఐ సత్యకిషోర్, సీతానగరం ఎస్సై డి.రామ్‌కుమార్ సిబ్బందితో కలిసి ముగ్గళ్ళ గోదావరి మాత విగ్రహం వద్ద మధ్యాహ్నం 3 గంటలకు నీలంశెట్టి వెంకటవాసు (రవీంద్రకాలనీ), రాజానగరానికి చెందిన గొడ్డు భాను శివశంకర్‌లను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. మణికంఠ అక్క శివ కుమారి నిడదవోలులో ఉంటున్నారు. తల్లితో కలిసి మణికంఠ అక్క ఇంటికి వెళ్లి తిరిగి ఈ నెల 12న ఇంటికి వచ్చాడు. తలుపులు తెరచి ఉండటంతో లోపలకి వెళ్లి చూడగా బీరువా లాకర్ బద్దలుకొట్టి ఉంది. అందులోని నాలుగు కాసుల బంగారు, 70 తులాల వెండి, పూజా గదిలో దాచిన రూ.1.50 లక్షల నగదు పోయిందని గుర్తించి ఫిర్యాదు చేశారు. ముద్దాయిల నుంచి మూడు గ్రాముల విలువ ఉన్న ఉంగరం, 750 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.50 లక్షల నగదు రికవరీ చేశామని తెలిపారు. దొంగతనానికి ఉపయోగించిన మోటారు సైకిల్ సీజ్ చేశామన్నారు. ముద్దాయిలను రాజమహేంద్రవరం సెవంత్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ (ఏజేఎఫ్‌సీఎమ్) కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని నార్త్‌జోన్ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు.