వారి పాపం.. తల్లులకు శాపం | - | Sakshi
Sakshi News home page

వారి పాపం.. తల్లులకు శాపం

Jul 19 2025 4:16 AM | Updated on Jul 19 2025 4:16 AM

వారి

వారి పాపం.. తల్లులకు శాపం

ఒక్కొక్కరి పేరిట పదులు,

వందల్లో విద్యుత్‌ మీటర్లు

కరెంటోళ్ల నిర్వాకంతో సంక్షేమానికి

దూరమవుతున్న పేదలు

రెవెన్యూ శాఖదీ అదే తంతు

మండిపడుతున్న అర్హులు

ఇదేం పాలనంటూ ఆగ్రహం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ సహాయంతో తమ పిల్లలను బాగా చదివించుకుందామని ఆశ పడిన వారికి ఆ ప్రభుత్వమే జెల్ల కొడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న తప్పిదాలు అర్హులైన ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. అందులోనూ ఈమధ్య కరెంటోళ్ల బాగోతాలు అందరినీ నిర్ఘాంతపరుస్తున్నాయి. ఎంతటి స్థితిమంతులకై నా మహా అయితే ఆరేడు వరకూ విద్యుత్‌ మీటర్లు ఉంటాయి. కానీ, నిన్న కాక మొన్న సామర్లకోటకు చెందిన ఓ మహిళ పేరిట ఏకంగా 40 విద్యుత్‌ మీటర్లు ఉన్నాయని వెల్లడి కావడం చూసి అందరూ నివ్వెరపోయారు. తాజాగా, అదే పట్టణంలో మరో మహిళ పేరిట ఏకంగా 180 విద్యుత్‌ మీటర్లు ఉన్నాయంటూ కరెంటోళ్లు షాక్‌ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అసలు ఒకే ఆధార్‌పై పదులు, వందల సంఖ్యలో మీటర్లు ఏవిధంగా ఉంటాయనే ఆలోచన కూడా తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్‌) అధికారులకు, సిబ్బందికి రాకపోవడం వింతల్లోకెల్లా వింత.

ఈపీడీసీఎల్‌ తీరు ఇలా ఉండగా.. తామేం తక్కువ కాదని రెవెన్యూ శాఖ కూడా అక్కడక్కడ నిరూపించుకుంటోంది. సెంటు భూమి కూడా లేని నిరుపేద తల్లుల పేరిట ఏకంగా 10, 11 ఎకరాల భూములు చూపించింది. ఇటువంటి అనేక కారణాలతో వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వేలాది మంది.. ఆ సంక్షేమాన్ని అందుకోలేక కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి సర్కార్‌ ఎంతో ఘనంగా ప్రకటించుకున్న తల్లికి వందనం పథకం డబ్బులు రాక పలువురు తల్లులు గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నానా అవస్థలూ పడుతున్నారు. కొందరి సమస్య పరిష్కారమైనా, ఇప్పటికే గడువు ముగిసిపోవడంతో తామేమీ చేయలేమంటూ మరి కొంత మందిని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంపై ఆయా సంక్షేమ పథకాలకు అర్హులైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పులకు తమను బలి చేయడమేమిటని, ఇదేం పరిపాలనని ప్రశ్నిస్తున్నారు.

తల్లికి వందనం అర్హుల వివరాలు

● కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో 2.80 లక్షల మంది, జూనియర్‌ కళాశాలల్లో 48,690 మంది విద్యార్థులున్నారు. తొలి విడతలో 1,49,403 మందిని మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులు మాటేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

● తూర్పు గోదావరి జిల్లాలో 1.88 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.23 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 65 వేల మందికీ అర్హత ఉన్నా వివిధ కారణాలతో తల్లికి వందనం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు.

● డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 2.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.80 లక్షల మంది అర్హులుగా తేల్చారు. మిగిలిన 30 వేల మంది విద్యార్థులూ తల్లికి వందనానికి దూరమయ్యారు.

గుత్తుల రాజేశ్వరి

కార్పొరేట్‌ పాఠశాలలో సీటు వచ్చిందంటూ..

కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గుత్తుల రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు దుర్గా చంద్రశేఖర్‌ 3, కుమార్తె శ్రీవల్లి 2 తరగతులు చదువుతున్నారు. అయినప్పటికీ వారికి తల్లికి వందనం జమ కాలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్‌ పాఠశాలల్లో రాజేశ్వరి కుమార్తెకు సీటు వచ్చిందన్న కారణంతో ఇద్దరు పిల్లలకూ తల్లికి వందనం రాలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. సచివాలయాన్ని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది తనిఖీ చేసి, ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని బదులిస్తున్నారు.

వేరే వారి భూమి లింక్‌ చేయడంతో...

కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన పాలపు పోచమ్మ, సత్తిబాబు దంపతులకు కుమార్తె మానస (పదో తరగతి), కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌ (7వ తరగతి) ఉన్నారు. కూటమి పాలకులు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వస్తాయనుకున్నారు. ఇద్దరికీ కలిపి రూ.30 వేలు వస్తాయని, ఆ డబ్బులు బిడ్డల చదువుకు ఉపయోగపడతాయని ఆశించారు. అయితే, ఎక్కడో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉంటున్న వారికి చెందిన భూమి పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్‌తో లింక్‌ అయ్యింది. మూడెకరాలు మానస ఆధార్‌కు, మరో నాలుగెకరాలు పోచమ్మ ఆధార్‌కు లింక్‌ అయ్యాయి. దీనిని కారణంగా చూపించి, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం ఇవ్వలేదు. నిజానికి పోచమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం తప్ప అదనంగా సెంటు భూమి కూడా లేదు. కానీ, రెవెన్యూ సిబ్బంది నిర్వాకంతో ఎన్‌ఆర్‌ఐల భూమి వీరి ఆధార్‌తో లింక్‌ అయ్యింది. ఆ ఎన్‌ఆర్‌ఐలు రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వగ్రామం వచ్చి వేలిముద్ర వేసి, పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్‌కు లింక్‌ అయిన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తొలగిస్తేనే కానీ వీరికి తల్లికి వందనం రాదని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని పోచమ్మ దంపతులు అమలాపురం కలెక్టరేట్‌లో అర్జీ ఇచ్చారు. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.

వారి పాపం.. తల్లులకు శాపం1
1/3

వారి పాపం.. తల్లులకు శాపం

వారి పాపం.. తల్లులకు శాపం2
2/3

వారి పాపం.. తల్లులకు శాపం

వారి పాపం.. తల్లులకు శాపం3
3/3

వారి పాపం.. తల్లులకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement