
రోజాపై వ్యక్తిగత దూషణలు సరికాదు
నల్లజర్ల: మాజీ మంత్రి ఆర్‌కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, భానుప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంటి పేరు గాలి కదా అని మహిళలపై గాలి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. రోజాపై ఈవిధమైన దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళతామని వనిత హెచ్చరించారు. మహిళలంటే టీడీపీకి అసలు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి ఘటన మరువక ముందే రోజాపై అసహ్యకరంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మహిళలను అవమానించడం, కించపర్చడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తడమే రోజా చేసిన నేరమా అని ప్రశ్నించారు. మహిళలపై దాడి జరిగితే తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని, ఎమ్మెల్యే భానుప్రకాష్ తాట ఎందుకు తీయలేదని నిలదీశారు. భానుప్రకాష్‌ను తక్షణం అరెస్ట్ చేయాలని వనిత డిమాండ్ చేశారు.
గాలి భానుప్రకాష్‌పై జాతీయ
మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
మాజీ హోం మంత్రి తానేటి వనిత