
‘తల్లికి వందనం’లో ఎస్సీ పిల్లల పట్ల వివక్ష
కడియం: తల్లికి వందనం పథకంలో ఎస్సీ విద్యార్థులకు తక్కువ డబ్బులు వేసి, కూటమి ప్రభుత్వం వివక్ష చూపిందని వైఎస్సార్ సీపీ కడియం మండల అధ్యక్షుడు, జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్‌చంద్ర స్టాలిన్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 9, 10 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రూ.10,900, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు రూ.8,200 చొప్పున మాత్రమే వారి తల్లుల ఖాతాలకు జమయ్యాయని తెలిపారు. తోటి వారి కంటే తమకు తక్కువగా రావడంతో వారందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. జేగురుపాడు గ్రామంలో పదో తరగతి విద్యార్థిని తొర్లపాటి నమ్రత తల్లి ఖాతాకు రూ.8,800, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి బడుగు జగన్ తల్లి ఖాతాకు రూ.8,200 మాత్రమే ప్రభుత్వం జమ చేసిందన్నారు. మండలంలో దాదాపు 1,500 మంది దళిత విద్యార్థులున్నారని, వీరికి ఈ పథకం పూర్తి స్థాయిలో అందలేదని స్టాలిన్ తెలిపారు. వీరికి న్యాయం చేయకపోతే కడియంలో దళిత విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
టీచర్లకు బోధనేతర పనులు
రద్దు చేయాలి
నల్లజర్ల: ఉపాధ్యాయలను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని, లేకుంటే ఆ పనులు బహిష్కరించాల్సి వస్తుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అన్నారు. సభ్యత్వ నమోదు నిమిత్తం శుక్రవారం నల్లజర్ల వచ్చిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యోగా దినోత్సవం, మెగా పేరెంట్స్ – టీచర్స్ డే, మొక్కల పంపిణీ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయడం వంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులకు అప్పగించడం ఎంత మాత్రమూ తగదన్నారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ల పంపిణీ, ఒక్క రోజులో బయోమెట్రిక్ పూర్తి చేయాలని ఆదేశించడం కేవలం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమేనని దుయ్యబట్టారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బంది లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని జయకర్ చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మనోహర కుమార్, ఎన్.భవాని, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎఫ్ ఆలీ అహమ్మద్, బి.కిశోర్, టి.నాగేశ్వరావు పాల్గొన్నారు.
అష్టదేవతల తీర్థయాత్రకు
ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అష్ట దేవతల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు నడిపామని ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. రెండు బస్సులలో సుమారు 100 మంది భక్తులు శుక్రవారం అష్ట దేవతల దర్శనానికి బయలుదేరి, రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకున్నారని తెలిపారు. ఈ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహి మాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట గ్రామాల్లో వెలసిన దేవతలను దర్శిస్తారని వివరించారు.
ఎరువుల కొరత లేదు
దేవరపల్లి: ఖరీఫ్ పంటలకు అవసరమైన అన్ని రకాల ఎరువులూ రైతులకు అందుబాటులో ఉంచామని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్‌లోని 10 మండలాల్లో 9,915 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డివిజన్‌లోని 9 మండలాల్లో 10,336 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డీఏపీ 1,455 మెట్రిక్ టన్నులు, ఎఫ్‌ఓఎం 1,199 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,027 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 6,377 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 2,474 మెట్రిక్ టన్నులు, యూరియా 6,397 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 20,272 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని వివరించారు. సొసైటీలు, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపారు.

‘తల్లికి వందనం’లో ఎస్సీ పిల్లల పట్ల వివక్ష

‘తల్లికి వందనం’లో ఎస్సీ పిల్లల పట్ల వివక్ష