నిడదవోలు: పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో విద్యార్థులపై వివక్ష చూపుతున్న ఘటనపై జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు స్పందించారు. స్కూల్‌లో 6, 7 తరగతుల విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడటం లేదనే పేరుతో వారి యూనిఫాంకు ‘ఇంగ్లిష్ డిఫాల్టర్’ అనే ట్యాగ్ తగిలించడంపై ‘విద్యార్థుల పట్ల వివక్ష’ అనే శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి విద్యాశాఖాధికారులు స్పందించారు. జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు ఆదేశాల మేరకు ఎంఈఓ పి.గురుమూర్తి స్కూల్‌లో శుక్రవారం విచారణ చేపట్టారు. సదరు విద్యార్థులతో ట్యాగ్ తగిలించడంపై వివరణ కోరగా, విద్యార్థులు విషయాన్ని ఎంఈఓకు స్పష్టంగా చెప్పారు. అనంతరం మరికొన్ని తరగతుల విద్యార్థులను విచారించారు. ఈ మేరకు హెచ్‌ఎం మేరీ సమక్షంలో సంబంధిత పాఠశాలకు చెందిన సుమారు 25 మంది ఉపాధ్యాయులకు ఎంఈఓ విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులపై ఇలాంటి చర్యలు సరైనవి కావని హితవు పలికారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని స్కూల్ కరస్పాండెంట్ పుష్ప, విద్యార్థులకు ట్యాగ్‌లు తగిలించిన టీచర్ లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ తీసుకున్నారు. విద్యార్థులకు భయం ఉంటుందనే ఉద్దేశంతోనే ట్యాగ్‌లు తగిలించానని, దీనికి యాజమాన్యంతో ఎలాంటి సంబంధం లేదని సదరు టీచర్ ఎంఈఓకు వివరణ ఇచ్చారు. కరస్పాండెంట్ పుష్ప, ట్యాగ్‌లు తగిలించిన టీచర్ స్టేట్‌మెంట్లను జిల్లా విద్యాశాఖాధికారికి పంపిచినట్లు ఎంఈఓ తెలిపారు.
విద్యార్థులపై వివక్ష.. ఎంఈఓ విచారణ