40 మీటర్లు ఉన్నాయంటూ.. | - | Sakshi
Sakshi News home page

40 మీటర్లు ఉన్నాయంటూ..

Jul 19 2025 4:16 AM | Updated on Jul 19 2025 4:16 AM

 40 మ

40 మీటర్లు ఉన్నాయంటూ..

సామర్లకోట పట్టణం కిర్లంపూడి రోడ్డులోని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో కటకం నాగసత్య గంగాభవాని అద్దెకు ఉంటున్నారు. భర్త శ్రీను ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్‌ మెషీన్లు మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లికి వందనం కింద ఇద్దరికీ రూ.30 వేలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు. ఆ డబ్బులు రాకపోయేసరికి సచివాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి ఆ దంపతులు కంగు తిన్నారు. కూటమి సర్కారు వచ్చాక ఒక మీటరుకు వస్తున్న బిల్లు చెల్లించడమే కష్టంగా ఉంది. అటువంటి గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్‌ మీటర్లు ఉన్నట్లు ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులు రికార్డు చేశారు. దీంతో, ఆ దంపతులు సామర్లకోట సబ్‌ స్టేషన్‌కు వెళ్లి తమ పేరిట ఉన్న విద్యుత్‌ మీటర్లను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మీటరుకు రూ.35 చొప్పున చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు. ఇందులో తమ తప్పేమీ లేనప్పటికీ గంగాభవాని దంపతులు 40 మీటర్లకు రూ.1,400 చెల్లించుకున్నారు. అయినప్పటికీ, మీటర్లు తొలగించడానికి ఈపీడీసీఎల్‌ సిబ్బంది నెల రోజులు చేశారు. అప్పటికే తల్లికి వందనం గడువు కూడా పూర్తయిపోయింది. ఆ డబ్బులు రాకపోగా, తమకు చేతి చమురు వదిలిపోయిందని గంగాభవాని దంపతులు ఆవేదన చెందుతున్నారు.

ఆమె పేరిట ఏకంగా 180 మీటర్లు

ఈపీడీసీఎల్‌ నిర్వాకాలు పరాకాష్టకు చేరాయనడానికి ఇది మరో ఉదాహరణ. సామర్లకోట నాలుగో వార్డుకు చెందిన సీకోలు శ్రీదేవి కుటుంబం ఒక రేకుల షెడ్‌లో నివాసం ఉంటోంది. ఆమె రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటోంది. ఆమె భర్త వ్యవసాయ కూలీ. వీరికి కుమారుడు (4వ తరగతి), కుమార్తె (3వ తరగతి) ఉన్నారు. తమ బిడ్డలకు తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆ దంపతులు గంపెడాశతో ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనిపై సచివాలయంలో సంప్రదిస్తే ఏకంగా 17,758 యూనిట్ల విద్యుత్‌ వినియోగించినట్టు రికార్డుల్లో ఉందనే కబురు చల్లగా చెప్పారు. వాస్తవానికి ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డుకు ఏనాడూ 60 యూనిట్లకు మించి కరెంటు బిల్లు రాలేదు. దీనిపై ఈపీడీసీఎల్‌ అధికారులను సంప్రదిస్తే శ్రీదేవి ఆధార్‌ నంబర్‌ 4329 0153 9009తో ఏకంగా 180 విద్యుత్‌ మీటర్లు లింక్‌ అయి ఉన్నాయని తెలిసింది. దీంతో, ఆ దంపతులకు గుండె ఆగిపోయినంత పనైంది. కూలీ పని చేసుకునే తమకు 180 మీటర్లు ఏమిటని నిలదీస్తే ఫిర్యాదు తీసుకుని, 179 మీటర్లు తొలగించారు. కానీ, ఆమె పేరిట వచ్చిన 17,758 యూనిట్ల బిల్లును సవరించలేదు. చివరకు కరెంటోళ్ల పుణ్యమా అని ఆ కుటుంబం తల్లికి వందనానికి దూరమైంది.

వీరికి కోత

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 2వ వార్డు సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న యల్ల గంగాభవాని, శ్రీను దంపతులు పది మందికి న్యాయం చేసే న్యాయవాద వృత్తిలో ఉన్నారు. వీరి పిల్లలు సత్యకిరణ్‌ వర్ధన్‌, హర్షవర్ధన్‌ ఇంటర్‌, టెన్త్‌ చదువుతున్నారు. ఇద్దరికీ కలిపి తల్లికి వందనం డబ్బులు రూ.30 వేలు వస్తాయని ఆ దంపతులు భావించారు. తీరా చూస్తే కిరణ్‌వర్ధన్‌కు రూ.9 వేలు, హర్షవర్ధన్‌కు రూ.10,900 మాత్రమే గంగాభవాని ఖాతాలో జమయ్యాయి. ఇంత తక్కువగా ఎందుకు పడ్డాయని సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది నుంచి తెలియదనే సమాధానమే వస్తోంది. అందరి మాదిరిగా రూ.13 వేల చొప్పున పడినట్లు చెబుతున్నారు. కానీ ఖాతాలకు జమయ్యింది మాత్రం తక్కువగా ఉంది. అందరికీ న్యాయం చేసే వృత్తిలో ఉన్న ఆ దంపతులు తమకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

 40 మీటర్లు ఉన్నాయంటూ.. 
1
1/2

40 మీటర్లు ఉన్నాయంటూ..

 40 మీటర్లు ఉన్నాయంటూ.. 
2
2/2

40 మీటర్లు ఉన్నాయంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement