కార్మిక చట్టాలు విస్మరిస్తున్న పేపర్‌మిల్లు | - | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాలు విస్మరిస్తున్న పేపర్‌మిల్లు

Jul 19 2025 4:16 AM | Updated on Jul 19 2025 4:16 AM

కార్మిక చట్టాలు విస్మరిస్తున్న పేపర్‌మిల్లు

కార్మిక చట్టాలు విస్మరిస్తున్న పేపర్‌మిల్లు

సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్‌ మిల్లు యాజమాన్యం కార్మిక చట్టాలను కాలరాస్తోందని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మిల్లు ఎదురుగా ఉన్న కల్యాణ మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కార్మికులకు సంఘాలు పెట్టుకోవడం, కనీస వేతనాలు తదితర అనేక హక్కులు ఉన్నాయని చెప్పారు. వాటిని పేపర్‌మిల్లు యాజమాన్యం తుంగలో తొక్కుతోందని దుయ్యబట్టారు. మిల్లు ఆదాయం అమాంతం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని కార్మికులు పలుమార్లు డిమాండ్‌ చేసినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. రూ.కోట్ల లాభాలు గడిస్తున్నా.. కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాల్సి ఉన్నా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారన్నారు.

రూ.కోట్లలో లాభాలు.. కార్మికులకు పస్తులు

ఆంధ్రా పేపర్‌ మిల్లును 1924లో స్థాపించారని, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని మొండి వైఖరిని యాజమాన్యం ప్రదర్శించడం దారుణమని రాజా మండిపడ్డారు. యాజమాన్యానికి పదేళ్లుగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయన్నారు. మిల్లు ఆదాయం 2014లో రూ.61 కోట్లు ఉంటే.. 2024 నాటికి రూ.430 కోట్లకు పెరిగిందన్నారు. 2014లో రూ.1,314.84 కోట్లుగా ఉన్న ఆస్తులు.. 2024కు రూ.2,450.95 కోట్లకు పెరిగాయన్నారు. మిగులు నిధులు రూ.1,853.43 కోట్లు ఉన్నా.. కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడం లేదని ఆవేదన చెందారు. 35 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుడికి రూ.13,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలు తీసుకుంటున్న సంస్థ వారి సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదని రాజా స్పష్టం చేశారు. పేపర్‌ మిల్లు ఈడీ ముఖేష్‌ జైన్‌ నెలకు రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షల జీతం తీసుకుంటున్నారన్నారు. యాజమాన్యం, అధికారులు లేనిపోని ఈగోకు పోవద్దని.. కార్మికులకు న్యాయం జరుగుతుందంటే ఎవరి బూట్లు తుడవడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ఈ నెల 9 నుంచి కార్మికుల పక్షాన పోరాడుతున్నామని, ప్రభుత్వం వద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకూ సమయం ఇచ్చామని అన్నారు. అప్పటిలోగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 22వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జక్కంపూడి రాజా అల్టిమేటం జారీ చేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, నందెపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజాకు పోలీసుల నోటీసులు

ఆంధ్రా పేపర్‌ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో శాంతియుత ఆందోళన చేస్తున్న జక్కంపూడి రాజాకు పోలీసులు శుక్రవారం రాత్రి నోటీసులు అందించారు. పేపర్‌ మిల్లు సమీపంలో ఉండకూడదని, కల్యాణ మండపాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పేపర్‌ మిల్లుకు 500 మీటర్ల లోపు ధర్నాలు, ఆందోళనలు చేపట్టకూడదని తెలిపారు. తాను ఎటువంటి ధర్నా చేయకపోయినా నోటీసులు ఇచ్చి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని రాజా అన్నారు.

ఆదాయం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు పెరగడం లేదు

సమస్యల పరిష్కారానికి 21 వరకూ గడువు

లేకుంటే 22 నుంచి ఆందోళన ఉధృతం

వైఎస్సార్‌ సీపీ నేత జక్కంపూడి రాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement