
అక్రమంగా ర్యాంపు ఏర్పాటు
కొత్తపేట: ఆత్రేయపురం లంక భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి, తరలించేందుకు టీడీపీ మట్టి మాఫియా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. దానిలో భాగంగా భారీ ర్యాంపు ఏర్పాటు చేసింది. ఆత్రేయపురంలో అధికారిక ఇసుక ర్యాంపు ఉంది. కాగా చినపేట సమీపాన సొసైటీ భూములు, శ్మశాన దిబ్బలు ఉన్నాయి. వాటి పక్క నుంచి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆత్రేయపురంలో టీడీపీ నేత ఆగడాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. అధికార యంత్రాంగం కూడా వారి ఆగడాలకు కొమ్ము కాస్తూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ అక్రమ వ్యవహారాల్లో భాగంగానే తాజాగా ఆ నాయకుడు ప్రస్తుతం అక్రమ మట్టి తవ్వకాలపై దృష్టి సారించారు. గురువారం యుద్ధప్రాతిపదికన పొక్లెయినర్‌తో పనులు చేపట్టి లంకభూముల్లోకి ర్యాంపును ఏర్పాటు చేస్తూ వెళ్లారు. ట్రాక్టర్లు, లారీల్లో మట్టి తరలింపునకు అనువుగా, అవి దిగబడిపోకుండా కొబ్బరి ఆకులను కూడా ట్రాక్టరుపై తరలించారు. అక్రమంగా ర్యాంపు ఏర్పాటుపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు స్పందించలేదని పలువురు గ్రామస్తులు తెలిపారు. దాంతో గ్రామస్తులే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ర్యాంపు పనులు నిలిపివేసి యంత్రాలను ఎక్కడివి అక్కడే నిలిపివేశారు. రాత్రి సమయంలో మట్టి రవాణాకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దీనిపై గ్రామస్తులు ఆందోళనకు సిద్ధం కావడంతో ఎట్టకేలకు సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి యంత్రాలను, ట్రాక్టర్లను లంక భూముల్లోంచి బయటకు తీసుకువచ్చారు. దీనిపై రెవెన్యూ, పోలీసు అధికారుల వివరణకు ఫోన్‌లో ప్రయత్నించగా వారు స్పందించలేదు.
ఆత్రేయపురంలో
భారీగా మట్టి తవ్వకాలకు ప్రయత్నాలు
అడ్డుకున్న గ్రామస్తులు

అక్రమంగా ర్యాంపు ఏర్పాటు