
ప్రియురాలిని హత్య చేసి పరారీ
రాజోలు: చెడు వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చాకుతో పొడిచి హత్య చేశాడు. బుధవారం రాత్రి బి.సావరం సిద్ధార్థనగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె నిరాకరించింది. దీంతో వారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ప్రియురాలు ఓలేటి పుష్ప(22)ను ప్రియుడు రాజోలు కోళ్ల వారి వీధికి చెందిన షేక్ షమ్మా చాకుతో గుండెల్లో పొడవడంతో ఒక్కసారిగా పుష్ప ప్రాణాలు కోల్పోయింది. కూతురిని కాపాడుకునేందుకు పుష్ప తల్లి గంగ, పుష్ప అన్న వినయ్ అడ్డువెళ్లగా వారిద్దరిపై కూడా షేక్ షమ్మా చాకుతో దాడి చేసి గాయపర్చాడు. వారి కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు షమ్మా అక్కడి నుంచి పారిపోయాడు. సిద్ధార్థనగర్‌లో జరిగిన హత్య విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజోలు సీఐ నరేష్‌కుమార్, ఎస్సై రాజేష్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు దాడిలో గాయపడ్డ తల్లి గంగ, అన్న వినయ్‌లను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సీఐ నరేష్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం యెనుముల్లంక గ్రామానికి చెందిన ఓలేటి పుష్పకు ఐదేళ్ల క్రితం రాజోలు మేకలపాలానికి చెందిన ఓలేటి సతీష్‌తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భార్యాభర్తల మద్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన నాలుగేళ్ల కుమారుడితో పుష్ప, ఆమె తల్లి అంగాని గంగతో కలసి బి.సావరం సిద్ధార్థనగర్‌లో నివాసం ఉంటోంది. రెండేళ్లు క్రితం నుంచి రాజోలు కోళ్లవారి వీధికి చెందిన షమ్మాతో పుష్పకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు సహజీవనం చేస్తున్నారు. మద్యానికి బానిసైన షమ్మా తన అవసరాల కోసం పుష్పను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, డబ్బు కోసం వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని పుష్ప తన తల్లి గంగ, అన్న వినయ్‌కు మొర పెట్టుకుంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పావంటూ పుష్పతో గొడవపడి ఆమెను చాకుతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పారిపోయిన షమ్మాను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు.
అడ్డు వచ్చిన ఆమె తల్లి, అన్నపై దాడి

ప్రియురాలిని హత్య చేసి పరారీ